Begin typing your search above and press return to search.

తొమ్మిదేళ్ల తర్వాత తల్లిని కలిసిన క్రికెటర్ కుమార్.. దీనికి గర్వపడాలా?

By:  Tupaki Desk   |   5 Aug 2022 12:30 AM GMT
తొమ్మిదేళ్ల తర్వాత తల్లిని కలిసిన క్రికెటర్ కుమార్.. దీనికి గర్వపడాలా?
X
తమ మనసులోని భావాల్నిపంచుకోవటం కోసం సోషల్ మీడియా ఇప్పుడు చాలామందికి అండగా నిలుస్తోంది. దీని కారణంగా కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది టీమిండియా ఆల్ రౌండర్.. స్టార్ క్రికెటర్ అయిన కుమార్ కార్తికేయ. తన తల్లిని కలిసిన సంతోషాన్ని ప్రజలతో షేర్ చేసుకున్నాడు.

ఇంతవరకు బాగానే ఉంది. కాకుంటే.. ఆ సందర్భంగా అతగాడు చెప్పిన వివరాలే.. సమ్ థింగ్ రాంగ్ అనేలా మారాయి. ఎందుకంటే.. తన తల్లిని తొమ్మిదేళ్ల మూడు నెలల తర్వాత కలిసినట్లుగా పేర్కొన్నారు.

ఎందుకిలా? అంటే మాత్రం క్రికెట్ మ్యాచ్ లు.. ప్రాక్టీసుతో బిజీగా గడపటం.. కొవిడ్ తదితర కారణాలుగా పేర్కొన్నాడు. ప్రతి విషయానికి కరోనా పేరును ప్రస్తావించే వేళ.. కరోనా అన్నది రెండేళ్ల పాటే తప్పించి.. జీవితం మొత్తం లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తొమ్మిదేళ్లలో రెండేళ్లు.. కాదంటే మరో ఏడాదిని కూడా కలుపుకొని మూడేళ్లు అనుకున్నా.. మిగిలిన ఆరేళ్ల మాటేంటి? ఆరేళ్లు తల్లికి ఎందుకు దూరంగా ఉన్నట్లు?

నిజానికి కష్టంలో ఉన్నప్పుడే కదా తల్లికి దగ్గరగా ఉండాలి? ఒక వ్యక్తి తన జీవితంలో తొమ్మిదేళ్లు తల్లికి దూరంగా ఉండటం.. అందుకు కెరీర్ ను కారణంగా చూపిస్తే.. దాన్నో గొప్ప విషయంగా భావించాలా? దానికి అతడ్ని మనం విష్ చేయాలా? అన్నది ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదిలినప్పుడు కలిగే సందేహాలు ఏమంటే.. అతడు చెప్పే దానికి మించి మరేదో జరిగి ఉంటుంది.

ఆ విషయాల్ని వెల్లడించకుండా.. తన తల్లిని కలిసిన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. తాను తన తల్లిని కలిసిన కాలాన్ని అతను ప్రస్తావించకుంటే.. సరిపోయేది.

అది కాస్తా.. క్లియర్ గా తొమ్మిది సంవత్సరాల తర్వాత తల్లిని కలిసిన వైనాన్ని వెల్లడించటంతో మొదటికే మోసం వచ్చిన పరిస్థితి. ఇంతకాలం తల్లికి దూరంగా ఉండి.. ఏం సాధించినా.. అది సాధించినట్లే ఉంటుందా? ఈ తొమ్మిదేళ్లలో ఆ తల్లి పడిన వేదన.. ఒక ట్వీట్ తో తగ్గిపోతుందంటారా?