Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం

By:  Tupaki Desk   |   27 Oct 2022 12:05 PM GMT
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం
X
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ పాకిస్తాన్ పైనే కాదు.. ఈరోజు జరిగిన నెదర్లాండ్ తో మ్యాచ్ లో కూడా రెచ్చిపోయి ఆడడంతో భారత్ రెండో విజయం నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ దంచికొట్టడంతో భారత్ సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఏకంగా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 123/9 స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 2, అక్షర్ పటేల్ 2, అశ్విన్ 2, అర్ష్ దీప్ 2 , షమీ ఒక వికెట్ తీశాడు. వరుసగా రెండో విజయంతో పాయింట్స్ టేబుల్ లో టీమిండియా టాప్ లో నిలిచింది. సూపర్ 12లో తన తరువాతి మ్యాచ్ ను ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడనుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ (53) ఆచితూచి ఆడుతూనే స్కోరు బోర్డును నడిపించాడు. అలాగే రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (62) తన ఫామ్ ను కొనసాగిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. భారతీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ పెవిలియన్ కు చేరాడు. అయితే ఆ తర్వాతే స్కోరు బోర్డు మరింత వేగం పుంజుకుంది.

ఇక సూర్యకుమార్ వచ్చీరాగానే రెచ్చిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. క్లిష్టమైన పిచ్ పై విరాట్ తో కలిసి మూడో వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది.

ఇక భారత బౌలర్ల ధాటికి సీరియల్ గా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.