Begin typing your search above and press return to search.

టీమిండియా క్లీన్ స్వీప్ తో.. చరిత్రలో తొలి జట్టుగా అరుదైన రికార్డు

By:  Tupaki Desk   |   28 July 2022 4:40 AM GMT
టీమిండియా క్లీన్ స్వీప్ తో.. చరిత్రలో తొలి జట్టుగా అరుదైన రికార్డు
X
మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోవటం ద్వారా అరుదైన రికార్డును సాధించిన తొలి జట్టుగా నిలిచింది టీమిండియా. వెస్టిండీస్ జట్టుతో జరిగిన తాజా వన్డేలో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. మూడు వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది. తాజా విజయంతో విండీస్ గడ్డపై మూడుసార్ల కంటే ఎక్కువ జరిగిన వన్డే సిరీస్ లో తొలిసారి క్లీన్ స్వీప్ చేసినట్లైంది. అంతేకాదు.. వెస్టిండీస్ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్ లను గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రను క్రియేట్ చేసింది. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇక.. మూడో వన్డే విషయానికి వస్తే.. తొలుత బ్యాట్ చేసిన టీమిండియా జట్టు 256 పరుగులు చేసింది. 257 పరుగల విజయ లక్ష్యంతో మొదలైన జట్టు.. లక్ష్యానికి దూరంగానే అలౌట్ అయ్యింది. దీంతో భారత్ 119 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డు తగలటం.. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేని విండీస్ జట్టు తక్కువ పరుగులకే కుప్పకూలిపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరే శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ ధావన్ 58 పరుగులు చేయగా.. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 98 పరుగులు చేశారు. మరో రెండు పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడు. వన్డేల్లో తొలి సెంచరీని మిస్ అయ్యారు. దీనికి కారణం వర్షం పడటమే. గిల్ 98 పరుగుల వద్ద ఉండగా భారీగా వర్షం కురవటంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఈ ఇద్దరి పుణ్యమా అని తొలి వికెట్ కు 113 పరుగులు జోడించటంతో జట్టు భారీ స్కోర్ సాధించే వీలు కలిగింది.

తొలి వికెట్ పడిన కాసేపటికే వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిపివేశారు. రెండు గంటల ఆలస్యంగా మొదలైన మ్యాచ్ ను ఇరు జట్లకు 40 ఓవర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వికెట్ కోల్పోయే సమయానికి శ్రేయస్ అయ్యర్ 44 పరుగులు చేశారు. దీంతో భారత్ 199 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 8.. సంజూ 6 పరుగులు (నాటౌట్) చేశారు. శుభమన్ 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా మరోసారి వర్షం కురవటంతో మ్యాచ్ నిలిచింది. అప్పటికే టీమిండియా 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో లెక్క వేసి వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు రెండో ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ వేసి తన తొలి ఓవర్ లో మేయర్స్.. బ్రూక్స్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపటం జట్టుకు షాకింగ్ గా మారింది. దీంతో.. తర్వాత వచ్చిన షై హోప్ 22.. బ్రెండన్ కింగ్ కాసేపు నిలకడగా ఆడుతున్న వేళ చాహల్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. 9.5 ఓవర్ లో మూడో వికెట్ ను విండీస్ కోల్పోయింది. రంగంలోకి దిగిన కెప్టెన్ పూరన్.. కింగ్ సాయంతో నష్ట నివారణ షురూ చేశాడు.

కానీ.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్ మెన్లు.. పెద్దగా స్కోర్ చేయకుండానే పెవిలియన్ బాట పట్టటంతో 26 ఓవర్లకే 137 పరుగులకు ఆలౌట్ అయ్యారు. విండీస్ పతనంలో చాహల్ 17 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా.. 14 పరుగులకు సిరాజ్ రెండు వికెట్లు తీశారు. శార్దూల్ 17 పరుగులకు రెండు వికెట్ల తీయటం.. టీమిండియా గెలుపునకు కారణమైంది.