Begin typing your search above and press return to search.

త‌మిళ నాట వైర‌ల్ క్వ‌శ్చ‌న్‌!.ర‌ఘును చంపిందెవ‌రు?

By:  Tupaki Desk   |   28 Nov 2017 9:58 AM GMT
త‌మిళ నాట వైర‌ల్ క్వ‌శ్చ‌న్‌!.ర‌ఘును చంపిందెవ‌రు?
X
త‌మిళ‌నాడులోని ప్ర‌ముఖ న‌గ‌రం కోయంబ‌త్తూరులో గ‌తవారం జ‌రిగిన ఓ ప్ర‌మాదం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. జ‌రిగింది ఓ సాధార‌ణ రోడ్ యాక్సిడెంట్‌ గానే క‌నిపిస్తున్నా... ఆ ప్ర‌మాదానికి దారి తీసిన కార‌ణాలు వెలుగులోకి రావ‌డంతో ఇప్పుడు ఆ ఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కే తెర లేసింది. ప్ర‌మాదం జ‌రిగిన చోట‌... న‌డిరోడ్డుపై పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో రాసిన ఓ ప్ర‌శ్న ఇప్పుడు త‌మిళ‌నాడు మొత్తం వైర‌ల్‌ గా మారిపోయింది. రాజ‌కీయ పార్టీలు కూడా ఈ ప్ర‌శ్న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో ఇప్పుడు ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి స‌ర్కారుపై నలు వైపుల నుంచి విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. వెర‌సి మొత్తంగా త‌మిళ‌నాడులో ఇప్పుడు మ‌రో కొత్త త‌ర‌హా ఉద్య‌మం ఊపిరి పోసుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇక ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకి వెళితే... అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ గా ప‌నిచేస్తున్న ర‌ఘుప‌తి కంద‌సామి సొంతూరు కోయంబ‌త్తూరు. గ‌త కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ర‌ఘు... పెళ్లి చూపుల నిమిత్తం గ‌త వారం సొంతూరికి వ‌చ్చాడు. గ‌త శుక్ర‌వారం ఏదో ప‌ని నిమిత్తం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రఘు... బైక్‌ పై బ‌య‌లుదేరాడు. దారిలో ఓ హోర్డింగ్ ను ఢీకొట్టిన ర‌ఘు కింద ప‌డిపోగా... అత‌డిపై నుంచి ట్ర‌క్కు వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో ర‌ఘు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ఇది నిత్యం రోడ్ల‌పై జ‌రుగుతున్న ప్ర‌మాదాల మారిదే క‌నిపించినా... ర‌ఘును ఢీకొన్న హోర్డింగ్ త‌మిళ‌నాట అధికార పార్టీగా ఉన్న అన్నాడీఎంకేది కావ‌డంతో ఇప్పుడు ఇది పెద్ద వివాదంగానే మారిపోయింది. రోడ్డు ప్ర‌మాదంలో యువ టెక్కీ ప్రాణాలు కోల్పోవ‌డంతో శోక‌సంద్ర‌మైన కోయంబ‌త్తూరు... ఆ త‌ర్వాత తేరుకుని అధికార పార్టీ అల‌స‌త్వంపై పోరు బాట ప‌ట్టేసింది. ర‌ఘు చ‌నిపోయిన ప్రాంతంలో న‌డిరోడ్డుపై పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో *ర‌ఘును చంపిందెవ‌రు?* అంటూ రాసి నిర‌స‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

ఈ విష‌యం తెలుసుకున్న విప‌క్షం డీఎంకే కార్యాధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ అధికార పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌ళ‌నిసామి స‌ర్కారు నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రితోనే ర‌ఘు ప్రాణాలు కోల్పోయాడ‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాకుండా కోయంబ‌త్తూరు వాసుల మాదిరే.. ర‌ఘు యాక్సిడెంట్‌పై *ఎంజీఆర్ సెంటిన‌రీ* అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వంపై ఓ పెద్ద యుద్ధాన్నే ప్ర‌క‌టించేశారు. అయినా ఇక్క‌డ ఎంజీఆర్ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే... అక్టోబ‌ర్ 3న ఎంజీఆర్ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా కోయంబ‌త్తూరులో స్థానిక అన్నాడీఎంకే నేత‌లు ఇప్పుడు ప్ర‌మాదానికి కార‌ణ‌మైన హోర్డింగ్‌ను ఏర్పాటు చేశార‌ట‌. అయితే ఎంజీఆర్ జ‌యంతి పూర్తి అయిన త‌ర్వాత కూడా ఆ హోర్డింగ్‌ను తొల‌గించాల్సిన బాధ్య‌త‌ను వారు మ‌రిచారు. ఈ క్ర‌మంలోనే ఆ హోర్డింగ్ ర‌ఘుప‌తి మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది.

ఈ కార‌ణంగానే స్టాలిన్... ఎంజీఆర్ సెంటిన‌రీ పేరిట ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించారు. వాహనదారులకు అవరోధంగా ఉండే ప్రమాదకరమైన హోర్డింగ్స్ పెట్టరాదన్న హైకోర్టు ఆదేశాలను అధికార పార్టీ ఉల్లంఘించిందని ఆయ‌న‌ ఆరోపించారు. ఆ కారణంగానే రఘు దుర్మరణం పాలయ్యాడని అన్నారు. ప్రభుత్వ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కోయంబత్తూర్ లోని అన్ని హోర్డింగ్స్ ను తొలగించాలంటూ స్థానిక డీఎంకె ఎమ్మెల్యే కె.కృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘు మృతి విషయంలో ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో ప్రతిపక్ష పార్టీ పీఎంకె సైతం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిందిగా సీఎం పళనిస్వామిని డిమాండ్ చేసింది. సీఎంపై కేసు నమోదు చేయాలని ఆయ‌న కోర్టును కోరారు. మొత్తంగా ఓ యువ టెక్కీ ప్రాణాల‌ను హ‌రించేసిన హోర్డింగ్ కార‌ణంగా ఇప్పుడు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పెద్ద చిక్కుల్లోనే ప‌డిపోయింది.