Begin typing your search above and press return to search.

ప్రేమించిన పెళ్లాన్ని ఎంత దారుణంగా చంపాడో..

By:  Tupaki Desk   |   5 July 2016 5:58 AM GMT
ప్రేమించిన పెళ్లాన్ని ఎంత దారుణంగా చంపాడో..
X
వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు కలిసి ఉన్న తర్వాత వారి మధ్య ఏమైందో కానీ.. ఆరాధించిన వ్యక్తే అత్యంత దారుణంగా అంతమొందించటం ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తోంది. హ్యాపీగా ఉన్నారని చెప్పే ఈ ఫ్యామిలీలో ఏం జరిగిందో కానీ.. భార్యను అత్యంత దారుణంగా భర్త చంపేసి.. ఆ ఆధారం లేకుండా చేయాలన్న ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత విషాదకరమైన అంశం.. ఈ గొడవలకు.. దారుణాలకు ఏ మాత్రం సంబంధం లేని వారి కుమార్తె ఇప్పుడు తెలిసితెలియని వయసులో ఎక్కడికో వెళ్లిన తల్లి కోసం ఆశగా ఎదురు చూడటం.

ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ ఘటనలోకి వెళితే.. ఆగ్రాకు చెందిన రూపేష్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్ వ్యూలో ఉంటున్నారు. అతడి భార్యది దక్షిణాఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన మహిళ. ఆమె పేరు సింతియా. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు వీరి వైవాహిక జీవితం సాగింది. వీరి అనుబంధానికి గుర్తు ఏడేళ్ల సానియా. ఏమైందో ఏమో కానీ.. భార్యను గొంతు నులిమి చంపేశాడు రూపేశ్. చేసిన తప్పును కప్పి ఉంచటమే కాదు.. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆనంతరం సూట్ కేసులో సర్దేశాడు.

ఇంత జరిగినా.. ఏమీ జరగనట్లుగా ఉండి.. కుమార్తెను స్కూల్ కు పంపించాడు. సోమవారం రాత్రి కుమార్తెను కారులో వెంట పెట్టుకొని వెళ్లిన అతగాడు.. మధ్యలో ఆమెను వదిలి.. శంషాబాద్ సమీపంలోని మదనపల్లి శివార్లలో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. రాత్రివేళ.. పెద్ద ఎత్తున మంటలు కనిపించటం.. కారు ఆగిపోయి ఉండటంతో అక్కడి స్థానికులు సందేహానికి గురయ్యారు.

వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. పోలీసులు వచ్చే లోపు.. కారు వద్దకు చేరుకున్న స్థానికులు రూపేశ్ ను ప్రశ్నించారు. అయితే.. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పటం.. అంతలో పోలీసులు రావటం.. విషయాన్ని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో షేర్ల వ్యాపారంలో వచ్చిన నష్టాలు భార్యభర్తల మధ్య గొడవలకు కారణమై ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. భార్యను అంత దారుణంగా ఎందుకు చంపిన విషయం మాత్రం ఇప్పటికి బయటకు రాలేదు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు కీలకాంశాలు ఏమిటంటే.. భార్యను గుట్టుగా మట్టుబెట్టి..ఎవరికి తెలీకుండా ఆమెను కాల్చేసే ప్రయత్నంలో రూపేశ్ తాను అనుకున్నట్లే అంతా పూర్తి చేసినా.. వర్షం కారణంగా పడిన గుంతలో అతని వాహనం ఇరుక్కుపోవటం.. అప్పుడే గ్రామస్తులు అతన్ని గుర్తించటం గమనార్హం. తప్పు చేసినోళ్లు ఏదో విధంగా దొరికిపోతారనటానికి ఇదో నిదర్శనం. ఇక.. తలుచుకుంటేనే కంటి వెంట నీరొచ్చేది వీరి కుమార్తె సానియా ఉదంతంలోనే. తండ్రిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక.. తల్లి ఎక్కడికి వెళ్లిందో అర్థంకాక అయోమయంలో ఉన్న ఆమెను చూసిన వారంతా అయ్యో అనుకునే దుస్థితి. ఏం తప్పు చేసిందని ఆ చిన్నారికి ఇంత శిక్ష..?