Begin typing your search above and press return to search.

టెక్నాల‌జీ బాబుకు ఐటీ స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   2 Aug 2016 2:33 PM GMT
టెక్నాల‌జీ బాబుకు ఐటీ స‌మ‌స్య‌
X
టెక్నాల‌జీ అంటేనే కేరాఫ్ అడ్ర‌స్‌ గా నిలిచిన తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇపుడు అదే టెక్నాల‌జీ స‌మ‌స్య‌గా మారుతోంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి కేంద్రంగా ప‌రిపాల‌న చేసేందుకు బాబు ఉత్సాహం చూపుతున్న‌ప్ప‌టికీ శాఖ‌ల త‌ర‌లింపు స‌మ‌స్య‌గా మారింది. రాజధానికి తరలివెళ్లేందుకు మళ్లీ మూడు కొత్త తేదీలు నిర్దేశించినప్పటికీ... అవి కూడా కొబ్బరికాయలు కొట్టి వచ్చేసే తరహాలోనే కనిపిస్తున్నాయి. ఈ ర‌కంగా జ‌రిగేందుకు స్కానింగ్ స‌మ‌స్య కార‌ణం కావ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రోవైపు తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉద్యోగుల విష‌యంలో ప్రేమ పూర్వ‌క ఒత్తిడి తెస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

వెల‌గ‌పూడి కేంద్రంగా ప‌రిపాల‌న చేసేందుకు సిద్ధ‌మైన బాబు శాఖ‌ల త‌ర‌లింపున‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వేర్వేరుగా ఏడు తేదీల‌ను ప్ర‌క‌టించారు. అయితే ఆయా తేదీల్లో తరలింపుపై విఫలమైన నేపథ్యంలో తాజాగా ఆగస్టు 4 - 7 - 10 తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ తేదీల్లో అంతా రావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇది కూడా సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఫైళ్ల అంశం పెద్ద సమస్యగా మారుతున్నట్లు కనిపిస్తోంది. లక్షల ఫైళ్లు - అందులో మరిన్ని లక్షల కాగితాలను స్కానింగ్‌ చేసి వెలగపూడికి తీసుకువెళ్లాల్సి ఉంది. అయితే ఇంతవరకు స్కానింగ్‌ జాడే కనిపించడం లేదు. ప్ర‌భుత్వం వ‌ద్ద పూర్తిస్థాయిలో స్కాన‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రైవేటు స్కానర్లను అద్దెకు తీసుకుని - వాటి ద్వారా స్కానింగ్‌ చేయించాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం అనేక శాఖలు ప్రైవేటు స్కానర్ల వెదుకులాటలోనే ఉన్నాయి. కొన్ని శాఖలు తమ వద్ద ఉన్న స్కానర్ల ద్వారా స్కానింగ్‌ ప్రారంభించినప్పటికీ, ఆ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు చెబుతున్నారు.

కాగా, స్కానింగ్‌ పూర్తయితే తప్ప తరలింపు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మొత్తం పత్రాలు స్కానింగ్‌ చేసేందుకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు. అందుకే కొత్తగా ప్రకటించిన తేదీల్లో వెలగపూడికి వెళ్లి అదే రోజు మళ్లీ వెనుకకు వచ్చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా, కొత్త రాజధానికి వెళ్లే ఆంధ్రా ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. దీనికోసం వచ్చే నెల ఐదో తేదీన సచివాలయంలో పెద్ద ఎత్తున వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిర్ణయిరచాయి. వెలగపూడికి తరలివెళ్లడంపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యోగులు మాత్రం వీడ్కోలు సమావేశ నిర్వహణకు నిర్ణయించడం గమనార్హం.