Begin typing your search above and press return to search.

ట్రంప్ కు చెక్ చెప్పేందుకు ప్రత్యర్థులు ఏకమయ్యారు

By:  Tupaki Desk   |   26 April 2016 7:31 AM GMT
ట్రంప్ కు చెక్ చెప్పేందుకు ప్రత్యర్థులు ఏకమయ్యారు
X
సొంత పార్టీ వారికే మింగుడుపడని విధంగా మారి.. అతగాడికి చెక్ చెప్పేందుకు కిందామీద పడుతున్న చిత్రమైన పరిస్థితి అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నేతలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో దిగేందుకు డోనాల్డ్ ట్రంప్.. టెడ్ క్రజ్.. జాన్ కాసిచ్ లు రంగంలోకి దిగారు. అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఠారెత్తిస్తున్న ట్రంప్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఊహించని విధంగా రిపబ్లికన్ అభ్యర్థుల్లో మిగిలిన వారితో పోలిస్తే.. ట్రంప్ అధిక్యతతో దూసుకెళ్లటం.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ట్రంపే రిపబ్లికన్ పార్టీ తుది అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. ట్రంప్ అభ్యర్థిత్వంపై ప్రపంచ వ్యాప్తంగానే కాదు.. ఆయన నేతృత్వం వహిస్తున్న సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో.. ఆయనకు చెక్ చెప్పేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తనను కానీ తొక్కేయాలని చూస్తే ఊరుకోనంటూ సొంత పార్టీ మీద ట్రంప్ గుస్సా అవుతుండటం.. ఆయన బలమైన శక్తిగా మారిపోవటంతో రిపబ్లికన్లకు దిక్కుతోచని పరిస్థితి. ఇష్టారాజ్యంగా మాట్లాడే ట్రంప్ నుకానీ పార్టీ తుది అభ్యర్థిగా నిర్ణయిస్తే.. పార్టీకి అంతులేని నష్టం జరగటం ఖాయమన్న భావనలో రిపబ్లికన్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు చెక్ చెప్పేందుకు వీలుగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.

నిన్నటి వరకూ రిపబ్లికన్ పార్టీలో ప్రత్యర్థులుగా ఉన్న టెడ్ క్రజ్.. జాన్ కాసిచ్ లు అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై తామిద్దరం పోటీ పడరాదని.. తమ ఉమ్మడి ప్రత్యర్థిగా ట్రంప్ ను లక్ష్యంగా చేసుకోవాలని వారు నిర్ణయించారు. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న మార్పులతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారనుంది.