Begin typing your search above and press return to search.

పెళ్లాలు తరువాత తెరపైకి అమ్మాయిల లెక్క

By:  Tupaki Desk   |   27 March 2016 10:32 AM GMT
పెళ్లాలు తరువాత తెరపైకి అమ్మాయిల లెక్క
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అభ్యర్థులెవరు తేలేందుకు కీలకమైన ఆయా పార్టీల ప్రైమరీ ఎన్నికలకు సంబంధించి రచ్చలో కొత్త కోణం తెర మీదకు వచ్చింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ రోజురోజుకీ దిగజారిపోవటం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా తుది బరిలో నిలిచేందుకు ట్రంప్.. క్రూజ్ లు పోటీ పడుతూ.. ఒకరిపై ఒకరు అధిక్యంలోకి కొనసాగేందుకు మొదలెట్టిన ఆరోపణలు వికృత రూపం దాలుస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ ట్రంప్.. క్రూజ్ ఇద్దరి భార్యల మీధ ఇరు వర్గాలు ఆరోపణలు.. విమర్శలు చేసుకోగా.. తాజాగా క్రూజ్ లక్ష్యంగా ఒక సంచలన వార్తను ఒకదాన్ని అమెరికా మీడియా సంస్థ నేషనల్ ఎంక్వైరర్ ప్రచురించింది.

దీని ప్రకారం.. క్రూజ్ కు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఒక లాయర్.. స్కూల్ టీచర్.. పొలిటికల్ కన్సల్టెంట్.. మామూలు అమ్మాయి.. ఒక వేశ్యతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. దీన్ని క్రూజ్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా తన ప్రత్యర్థి ట్రంప్ చేసిన కుట్రగా అభివర్ణించారు. అయితే.. ఈ కథనంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ట్రంప్ సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉంటే.. క్రూజ్ మీద వచ్చిన ఈ కథనానికి కావాల్సిన ముడిసరుకు మొత్తం రిపబ్లికన్ పార్టీకి చెందిన మార్క్ రూబియో వర్గం ఇచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్.. క్రూజ్ తో పాటు రూబియో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడి వైదొలిగారు. ఆయనే.. క్రూజ్ ను దెబ్బ తీసేందుకు ఈ వార్త కథనం మీడియాలో వచ్చేలా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు.. ట్రంప్ మహిళలపై ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా రిపబ్లికన్ అభ్యర్థులు ఇద్దరూ మహిళల పట్ల బొత్తిగా మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమలో తాము కొట్టుకోవటం ద్వారా రిపబ్లికన్ పార్టీ నేతలు.. డెమొక్రాట్లకు అధ్యక్ష పదవిని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేటట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.