Begin typing your search above and press return to search.

శృంగారానికి స్వేచ్ఛ‌నిస్తే.. ఎంత దారుణ‌మో.. అగ్రరాజ్యం నేర్పుతున్న అరుదైన పాఠం..!

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:11 AM GMT
శృంగారానికి స్వేచ్ఛ‌నిస్తే.. ఎంత దారుణ‌మో.. అగ్రరాజ్యం నేర్పుతున్న అరుదైన పాఠం..!
X
అగ్ర‌రాజ్యం అమెరికా ప్ర‌పంచానికి సుద్దులు చెబుతుంది. ఎవ‌రు ఎలా ఉండాలో .. ఉండ‌కూడ‌దో నీతులు బోధిస్తుంది. అలాంటి దేశం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల ముందు చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితిలోకి జారిపోయింది. దీనికి కార‌ణం విచ్చ‌ల‌విడి శృంగారానికి అనుమ‌తి ఇవ్వ‌డ‌మే. ఫ‌లితంగా పెళ్లికాకుండానే బాల్యం ద‌శ‌లోనే బాలిక‌లు త‌ల్లులు అయిపోయారు. ఆ పిల్ల‌ల‌ను తీసుకునే ఇప్పుడు స్కూళ్ల‌కు వెళ్తున్నారు. ఇప్పుడు ఇది క‌రోనా కంటే వేగంగా విస్త‌రించిపోతుండ‌డంతో అమెరికా త‌ల ప‌ట్టుకుంది. ఏం చేయాల‌ని ప్ర‌పంచ దేశాల‌ను స‌ల‌హా కోరుతోంది. చిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం!!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో ఉంది. అక్కడ ఓ బడి ఉంది. దాని పేరు లింకన్ పార్క్. ఈ స్కూల్‌లో విద్యార్థినుల అల్ల‌రితోపాటు పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. ఒకటీ రెండు కాదు.. చాలా గొంతులు గోల చేస్తాయి. ఎందుకంటే.. ఆ తరగతి గదిలో విద్యార్థులు మాత్రమే కాదు.. వారు కన్న పిల్లలు కూడా ఉంటారు. అలాగని వారంతా డబుల్ పీజీలు చదివిన విద్యార్థులు కాదు. పీహెచ్డీ చేస్తున్నవారు అంతకన్నా కాదు. జస్ట్.. టెన్త్ స్డాండర్డ్ కూడా దాటనివారే!

అమెరికాలో కావాల్సినంత సెక్స్‌ ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు అదే దేశాన్ని కొంప ముంచుతోంది. పెరిగిపోతు న్న టీనేజ్ గర్భాలపై కొంత కాలంగా యూఎస్లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితికి సజీవ సాక్ష్యమే టెక్సాస్ రాష్ట్రంలోని పాఠశాల. సెకండరీ స్థాయి ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయకుండానే గర్భం దాల్చి.. బిడ్డలకు జన్మనిచ్చిన టీనేజర్ల జీవితం గమ్యంలేని ప్రయాణం కాకుండా చూసేందుకు ఈ పాఠశాల ప్రయత్నిస్తోంది.

గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీనేజ్ గర్భవతులు విపరీతంగా పెరిగిపోయారు. ఇలాంటి వారికి 2005 నుండి సేవలందిస్తోంది లింకన్ పార్క్ స్కూల్. ఇందులో ఉన్న విద్యార్థులంతా 14 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. 15 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ప్రతీ వెయ్యి మంది యువతులలో.. 15 శాతం మంది 2020 సంవత్సరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

దీన్ని బట్టి టీనేజ్లో గర్భధారణ అన్నది ఎంత సాధారణం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి సమాచారం కలపలేదు. అవి కూడా చేర్చితే టీనేజ్ గర్భవతుల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. బ్రౌన్స్‌విల్లే నగరంలో ప్రతీ 10 మంది టీనేజర్లలో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారని లెక్కలు చెబుతున్నాయి.

ఇలాంటి అమ్మాయిల భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చిన్నతనంలోనే గర్భం దాల్చిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకసారి తల్లైన మహిళ.. గతంలో మాదిరి పటుత్వాన్ని తిరిగి పొందడం దాదాపుగా అసాధ్యం అంటారు నిపుణులు. అలాంటప్పుడు తమ శరీరమే పూర్తిగా ఎదగని వారు మరో బిడ్డకు జన్మనిస్తే దీర్ఘ కాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మానసికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. జీవితం అంటే ఏంటో సరిగా తెలియని వయసులో ఓ బిడ్డ భవిష్యత్తును నిర్మించే బాధ్యతను భుజాన వేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. జీవిత గమ్యమే తెలియని వాళ్లు.. ఓ బిడ్డను నెత్తికెత్తుకొని సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు సాగడం అంత తేలిక కాదంటున్నారు. ఈ క్రమంలో డిప్రెషన్కు గురికావడంతో పాటు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇలాంటి వారి సంఖ్య రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అబార్షన్లపై ఈ ఏడాది అమెరికా సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంతో చట్టం మరింత కఠినంగా అమలు కానుంది. దీంతో.. అనివార్యంగా బిడ్డల్ని కనే టీనేజర్ల సంఖ్య పెరిగిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అగ్ర‌రాజ్యం ఇప్పుడు ప్ర‌పంచ దేశాలు అనుస‌రిస్తున్న విధానాల‌పై దృష్టి పెట్టింది. మ‌రి చూడాలి ఏం చేస్తుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.