Begin typing your search above and press return to search.

మోడీ సభలో ఈ బాలుడు చేసిన పనికి ఫిదా

By:  Tupaki Desk   |   23 Sep 2019 6:47 AM GMT
మోడీ సభలో ఈ బాలుడు చేసిన పనికి ఫిదా
X
అమెరికాలోని హుస్టన్ లో భారత ప్రధాని నరేంద్రమోడీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్త నిర్వహించిన సభ సక్సెస్ అయ్యింది. మోడీ - ట్రంప్ లు రాగానే ఇరు దేశాల జాతీయ గేయాలాపన అందరిలోనూ స్ఫూర్తిని నింపింది. ఈ క్రమంలోనే భారత జాతీయ గీతం ‘జనగణమన’ను ఓ పదహారేళ్ల బాలుడు ఆలపించి ప్రత్యేకంగా నిలిచాడు. కాళ్లు చచ్చుబడిపోయి వీల్ చైర్ లో ఉన్న అతడు పాడిన పాట అందరినీ ఆకర్షించింది.. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? ఎందుకంత ప్రాధాన్యత అనేదానిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.

అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న భారత సంతతికి చెందిన బాలుడు స్పర్ష్. ఇతడి వయసు 16 ఏళ్లు. అరుదైన ‘బ్రిటిల్ బోన్ వ్యాధి’తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి గ్రస్తులకు ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతుంటాయి. దీంతో వీల్ చైర్ కే పరిమితమైపోయాడు స్పర్ష్.

కానీ స్పర్ష్ ఎంతో ప్రతిభాశాలి. ఇప్పటికే 140 సార్లు ఎముకలు విరిగినా ఆపరేషన్ చేయించుకొని అధైర్యపడకుండా ముందుకు సాగుతున్నాడు. ఇతడు ‘నాట్ అఫ్రైడ్’ అంటూ 2016లో విడుదల చేసిన వీడియో ఆల్బమ్ వైరల్ అయ్యింది. కోట్లాది మందిని కదిలించింది. అప్పటి నుంచి సంగీత కచేరీలు ఇస్తూ ఆ డబ్బుతో వైద్యం చేసుకుంటున్నాడు.

తాజాగా అమెరికాలోని హుస్టన్ సభలో ఈ భారత సంతతి కుర్రాడికి గౌరవం దక్కింది. భారత జాతీయ గీతాన్ని ఆలపించి మోడీని కలిశాడు. అతడి పట్టుదల, ప్రతిభ ప్రపంచానికి మరోసారి తెలిసింది.