Begin typing your search above and press return to search.

మత్తులో అమెరికా.. హైస్కూల్ స్థాయి నుంచే వ్యసనాలు..!

By:  Tupaki Desk   |   18 Nov 2022 11:30 AM GMT
మత్తులో అమెరికా.. హైస్కూల్ స్థాయి నుంచే వ్యసనాలు..!
X
పాశ్చాత్య పోకడలకు.. ఫాస్ట్ కల్చర్ కి అమెరికా పెట్టింది పేరు. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరిస్తోంది. టెక్నాలజీ పరంగా అమెరికా అందరికీ కంటే ఎంతో ముందుంటుందని మనందరికీ తెలిసిందే. అయితే అమెరికాలోని టీనేజర్లు మాత్రం క్రమంగా పెడదోవ పడుతున్నారని తాజాగా ఓ అధ్యాయనంలో వెల్లడి కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఇకపోతే అమెరికాలో అమలయ్యే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పిల్లల హక్కులకు ప్రభుత్వం సైతం రక్షణ కల్పిస్తుంది. అయితే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలించినా అమెరికాలో చట్టపరంగా శిక్షను అనుభవించాల్సిందే. దీనికితోడు అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే అమెరికన్ యువత క్రమంగా పక్కదారి పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (FDA), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లెక్కల ప్రకారం అమెరికాలో 11.3శాతం అంటే 3.08 మిలియన్ హైస్కూల్ విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. 2022లో అమెరికాలో పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది.

హై స్కూల్.. మిడిల్ స్కూల్ విద్యార్థులు పొగాకు ఉత్పత్తులను విరివిగా వినియోగిస్తున్నారని తేలింది. వీటిలో ఇ-సిగరెట్లను 2.55 మిలియన్ల విద్యార్థులు.. సిగార్లు 5 లక్షల మంది విద్యార్థులు.. సాధారణ సిగరెట్లను 4.4 లక్షల మంది వినియోగిస్తున్నారు.

అలాగే పొగలేని పొగాకును 3.3 లక్షలు.. హూక్కాను 2.9లక్షల మంది.. నికోటిన్ పౌచ్ లను 2.8 లక్షలు, హీటెడ్ పొగాకు ఉత్పత్తులను 2.6 లక్షలు.. పైపు పొగాకును 1.5 లక్షల మంది విద్యార్థులు వినియోగిస్తున్నారని వెల్లడైంది.

అమెరికాలోని అలస్కా కు చెందిన విద్యార్థులు పోగాకు ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్న వారిలో ఉన్నారు. ఇ-సిగరెట్లను ఎక్కువగా శ్వేతజాతీయులు వినియోగిస్తుండగా.. ప్రవాసీయులు.. నల్లజాతి విద్యార్థులు సిగార్లతో సహా మండే పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్నారని తేలింది.

మానసిక క్షోభ.. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు.. లింగమార్పిడి.. స్వలింగ సంపర్కుల వంటి అంశాలు సైతం అమెరికాలో పొగాకు ఉత్పత్తుల పెరుగుదలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు నల్ల మందు చైనా చిత్తయితే ఇప్పుడు పొగాకుతో అమెరికన్ యువత పెడదోవ పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.