Begin typing your search above and press return to search.

తీన్మార్ ‘కమలన్న’

By:  Tupaki Desk   |   1 Oct 2021 6:34 AM GMT
తీన్మార్ ‘కమలన్న’
X
జైలు నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన వారున్నారు. జైలు నుంచి రాజకీయాల్ని వదిలేసిన వారూ ఉన్నారు. కానీ పలానా పార్టీలో చేరుతున్నట్లు జైలు నుంచి ప్రకటించిన వ్యక్తి బహుశా తీన్మార్ మల్లన్న ఒక్కరేనేమో. మల్లన్న భావజాలం ఏంటి? ఆయన చేరుతున్న పార్టీ భావజాలం ఏంటి? ఇలాంటి సంధి కాలంలోనే ఆయన బలంగా పోరాడుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తన భావజాలానికి భిన్నంగా తిరోగమన దిశగా వెళ్తున్నారని విమర్శలు వస్తున్నారు. తీన్మార్ ‘కమలన్న’అంటూ జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మల్లన్న రాజకీయ జీవితం అంతా ఆసక్తిగానే సాగింది. ఇప్పుడు కూడా అందరి అంచనాలను తలకిందులు చేసి అనూహ్యంగా బీజేపీలో చేరుతున్నారని చెబుతున్నారు.

తీన్మాన్ మల్లన్న తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరిని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. క్యూ న్యూస్‌లో ఉదయం మల్లన్న దినపత్రికలను రివ్యూ చేస్తుంటే కొన్ని వేల మంది ఆ కార్యకమ్రాన్ని చూసేవారు. ఆయన ప్రసంగం కూడా ఉర్రూతలూగించేది. ప్రధానంగా యువతపై ఆయన చాలా ప్రభావం వేశారు. నల్గోండ, వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టించారు. మల్లన్నపై ప్రశంసలు కురిపించే వారు ఉన్నారు. అదే సమయంలో ఆయనను సున్నితంగా విమర్శించేవారు ఉన్నారు. ఓవైపు రాజ్యాంగ నియమాల గురించి మాట్లాడుతూనే మరోవైపు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై అభ్యంతరకర పదాలను ఉపయోగించారని తప్పుబట్టేవారు ఉన్నారు.

తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరనున్నారని ఆయన టీం ప్రకటించింది. ప్రధాని మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని పేర్కొంది. రిమాండ్‌లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను మల్లన్న సతీమణి మమత మెయిల్‌ ద్వారా కోరారని సమాచారం. అయితే మొదటి నుంచి తీన్మార్ మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ప్రచారం ఉంది. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొలేనని మల్లన్న అనుకున్నారో ఏమో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

మల్లన్న ఆయన షోలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, కాన్షీరాం లను మల్లన్న గుర్తుచేయని రోజు లేదు. కాన్షీరాం రాజకీయాల్ని ప్రచారం చేసిన మల్లన్న బీజేపీలో చేరడం పలు విమర్శలు వస్తున్నాయి. మల్లన్న జైలు నుంచి విడుదలయిన తర్వాత తమపై వస్తున్న విమర్శలు సమాధానం ఇస్తారో లేక రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సాదారణమే అని సర్ధుకుని కాషాయ కండువా కప్పుకుంటారో వేచి చూడాలి.