Begin typing your search above and press return to search.

వార‌ణాసిలో మోడీ మీద ఎస్పీ సంధించిన ఆస‌క్తిక‌ర అస్త్రం!

By:  Tupaki Desk   |   30 April 2019 5:43 AM GMT
వార‌ణాసిలో మోడీ మీద ఎస్పీ సంధించిన ఆస‌క్తిక‌ర అస్త్రం!
X
రూల్స్ ఎన్ని ఉన్నా స‌రే.. నిజం గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తే వేటు ప‌డుతుందా? అందునా మోడీ రాజ్యంలో అంటే.. అవున‌నే చెప్పాలి. నిత్యం నీతులు చెప్పే మోడీ మాష్టారి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌స్థ‌లు ఎలా ప‌ని చేస్తాయి? అన్న విష‌యం మీద ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చిన ప‌రిస్థితి. ఇక‌.. న్యాయం కోసం పోరాడిన వారిని.. అన్యాయం గురించి మాట్లాడిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న విష‌యం మీద కొత్త చ‌ర్చ‌కు తెర తీసిన వైనం ఒక‌టి చోటు చేసుకుంది.

మోడీ మీద పోటీ చేసే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన స‌మాజ్ వాద్ పార్టీ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. రాజ‌కీయాల‌కు భిన్నంగా.. ఊహించ‌ని వ్య‌క్తిని తెర మీద‌కు తెచ్చిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ మోడీ మీద వార‌ణాసిలో పోటీ చేస్తున్న ఎస్పీ అభ్య‌ర్థి ఎవ‌రో తెలుసా? బీఎస్ ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బ‌హ‌దూర్ యాద‌వ్‌.

పేరు విన్న‌ట్టుగా అనిపించ‌కున్నా.. అత‌గాడు యావ‌త్ దేశానికి సుప‌రిచితుడు. ఎలా అంటారా? కొన్నేళ్ల క్రితం భ‌ద్ర‌తా ద‌ళాల‌కు పెట్టే ఆహార నాణ్య‌తపై సెల్ఫీ వీడియోలో ఆవేద‌న వ్య‌క్తం చేసిన వ్య‌క్తి గుర్తున్నారా? భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ఇంత దారుణ‌మైన ఆహారం పెడ‌తారా? అంటూ యావ‌త్ దేశంలోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మైన స‌ద‌రు బీఎస్ఎఫ్ కానిస్టేబులే.. తాజాగా మోడీ మీద ఎస్పీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది.

ఆహార నాణ్య‌త గురించి ప్ర‌శ్నించిన వైనానికి.. అత‌డ్ని ఉద్యోగంలో నుంచి తీసేసిన వైనం చాలా త‌క్కువ‌మందికి తెలుసు. జ‌మ్ముక‌శ్మీర్ లోని స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌హిస్తున్న జ‌వాన్ల‌కు అందించే ఆహారం నాణ్య‌త లేద‌ని ఫిర్యాదు చేస్తూ 2017లో ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం.. అది పెద్ద ఎత్తున వైర‌ల్ కావ‌టం తెలిసిందే.

అత‌గాడి ఫిర్యాదు తెర మీద‌కు రాగానే.. ప్ర‌ధాని మోడీ స్పందిస్తార‌ని.. అవినీతి భ‌ర‌తం ప‌డ‌తార‌ని ప‌లువురు ఆశించారు. అయితే.. అందుకు భిన్నంగా వ్య‌వ‌స్థ‌లోని లోపాన్ని స‌రిచేయ‌కుండా.. క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో.. న్యాయం కోసం ప్ర‌శ్నించిన యాద‌వ్‌ గొంతును మ‌ళ్లీ బ‌య‌ట‌కు రాకుండా చేశారు.

తాజా ఎన్నిక‌ల్లో మోడీ మీద పోటీ చేసే అభ్య‌ర్థి ఎంపిక‌లో స‌మాజ్ వాదీ పార్టీ చ‌తుర‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. మోడీ ప్ర‌భుత్వ లోపాల్ని ఎత్తి చూపే సామాన్యుడ్ని తెర మీద‌కు తీసుకురావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అవినీతిని వేలెత్తి చూపించిన భ‌ద్ర‌తా ద‌ళాల కానిస్టేబుల్ ను బ‌రిలోకి దింపిన వైనం మోడీ బ్యాచ్ కు ఇబ్బంది క‌ల‌గించే అంశ‌మే. ఇదిలా ఉండ‌గా.. యాద‌వ్ త‌న ప్ర‌చారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. త‌ప్పు ఎత్తి చూపింనందుకు త‌న‌ను విధుల నుంచి తొల‌గించార‌ని.. భ‌ద్ర‌తా ద‌ళాల్లో ఉన్న అవినీతిని తొల‌గించ‌ట‌మే త‌న ల‌క్ష్యమ‌ని ఆయ‌న చెబుతున్నారు. వార‌ణాసి ఎన్నిక‌ల్లో యాద‌వ్ ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపిస్తారో చూడాలి.