Begin typing your search above and press return to search.

ఆమె వేదన తీరింది.. భర్తను కలిసింది

By:  Tupaki Desk   |   15 Feb 2017 2:03 PM GMT
ఆమె వేదన తీరింది.. భర్తను కలిసింది
X
కొన్ని విషయాలకు ఉన్నట్లుండి ప్రచారం లభిస్తుంది. జాతీయస్థాయిలో చర్చ నడుస్తుంది. కానీ.. ఉన్నట్లుండి ఆ వ్యవహారం అక్కడితో ముగిసిపోతుంది. కానీ.. ఎప్పుడైతే జన స్పందన అవసరం అవుతుందో అప్పుడే మీడియాలో పెద్దగా ఫోకస్ కాని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా అలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సోషల్ మీడియా పెద్ద ఎత్తునరియాక్ట్ అయిన ఉదంతంగా దీన్ని చెప్పాలి.

సరిహద్దు భద్రతా దళాలకు అందించే ఆహారం ఎంతనాసిరకంగా ఉంటుందన్న విషయాన్ని ఒక జవాను ధైర్యంగా వెల్లడించిన వైనం యావత్ దేశాన్ని ఒక్కసారి షాక్ తినేలా చేసింది. మాడిపోయిన రొట్టెలు.. నీళ్ల లాంటి పప్పుచారు పెట్టి..ఇవ్వాల్సిన డైట్ ఇవ్వకుండా అవినీతి అధికారులు దుర్మార్గాన్ని కళ్లకుకట్టినట్లుగా చూపించి.. పాలకుల మత్తును తన వీడియోతోవదిలించారు బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్.

అయితే.. ఆయన చేసిన పని ఏ మాత్రం సరికాదంటూ.. ఆయనపై క్రమశిక్షణ చర్యల్ని తీసుకోవటం.. భర్త ఆచూకీ లభించటం లేదంటూ తేజ్ బహదూర్ భార్య షర్మిల మీడియా ముందుకు పలుమార్లు వచ్చివాపోయింది. అయినప్పటికీ.. ఆమె మొర ఆలకించినవారు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను చూపించాలని.. ఆయనతో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని డింమాండ్ చేశారు

వీడియోను పోస్ట్ చేసిన నాటి నుంచి తన భర్తను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తేజ్ బహదూర్ తనకు చెప్పినట్లుగా ఆమె పేర్కొన్నారు. మీడియాలో తరచూ ఆమె వాదనకు సంబంధించిన వార్తలు రావటం.. హెబియస్ కార్పస్ పిటీషన్ ను ఆమె దాఖలు చేయటంతో.. తేజ్ బహదూర్ ను కలిసేందుకు అనుమతించాలంటూ కోర్టు బీఎస్ ఎఫ్ అధికారుల్ని ఆదేశించింది. అంతేకాదు.. రెండు రోజులపాటు కలిసి ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో భర్తను కలిసి వచ్చిన షర్మిల తన భర్త క్షేమంగా ఉన్నారని.. ఆయన్ను వేరే ప్రాంతానికి తరలించినట్లుగా వెల్లడించారు. యాదవ్ కొత్త ఫోన్ కొన్నారని.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని చెప్పారు. దీంతో.. తేజ్ బహదూర్ ఎపిసోడ్ కు శుభం కార్డు పడినట్లేనని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/