Begin typing your search above and press return to search.

సెలబ్రిటీల్లారా.. పిరికిపందల్లా ఉండకండి

By:  Tupaki Desk   |   28 April 2021 4:23 AM GMT
సెలబ్రిటీల్లారా.. పిరికిపందల్లా ఉండకండి
X
నాణేం ఎప్పుడూ బొమ్మనే పడదు.. అప్పుడప్పుడూ బొరుసూ పడుతుంది. మొదటి కరోనా వేవ్ ను లాక్ డౌన్ తో కట్టడి చేసిన ప్రధాని మోడీపై భారత్ లోని సెలబ్రిటీలంతా వేయినోళ్ల పొగిడేశారు. మోడీ అంత దైవాంశ సంభూతుడు మరొకరు లేరు అంటూ ఆకాశానికెత్తేశారు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ కు వచ్చేసరికి కేంద్రంలోని మోడీ సర్కార్ పనితీరు తేలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా.. దేశంలోనూ మోడీ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే తొలి కరోనా వేవ్ ను కట్టడి చేసి హీరో అయిపోయిన ప్రధాని మోడీని ఇప్పుడు సెకండ్ వేవ్ లో వైఫల్యంపై ఎవరూ నోరు మెదపడం లేదు. దీన్నే బీహార్ ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ తాజాగా ప్రశ్నించారు.

‘భారతీయ సెలబ్రిటీల్లారా.. పిరికిపందలుగా ఉండకండి.. ధైర్యం తెచ్చుకొని నోరు విప్పి మాట్లాడండి’ అంటూ తేజస్వి యాదవ్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. బాగు చేసినప్పుడు మెచ్చుకోవడమే కాదు.. దేశం ఇంత అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రశ్నించడం నేర్చుకోవాలని.. మీ నోళ్లకు ఏమైందని తేజస్వి వేసిన ప్రశ్నలు సెలబ్రిటీలకు కాస్త గట్టిగానే తగులుతున్నాయి.

ప్రజలు ఆక్సిజన్ లాంటి ప్రాథమిక అవసరాలు కూడా అందక చనిపోతున్నారని.. మీరు దైవాంశ సంభూతులుగా భావించే నేతల గందరగోళ విధానాలే ఇందుకు కారణం అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. మీ మనస్సాక్షి అమ్ముడు పోయిందా? అని కడిగిపారేశారు.

పాలకులకు కాదు.. దేశానికి విదేయత చూపండి అంటూ మోడీ సర్కార్ ను వెనకేసుకొస్తున్న వారిపై తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. సెలబ్రెటీలకు కర్రు కాచి వాత పెట్టారు.