Begin typing your search above and press return to search.

అలాద్దీన్ మన దగ్గర లేడు సారూ..

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:16 AM GMT
అలాద్దీన్ మన దగ్గర లేడు సారూ..
X
ఫాంహౌస్ నుంచి బయటకు వస్తే అయితే ప్రగతిభవన్ లేదంటే.. ఏదైనా కార్యక్రమానికి హాజరు కావటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. రోజుల తరబడి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి.. చేసి.. తాను అనుకున్నపని అనుకున్నట్లుగా జరిగిపోతుందన్న కాన్ఫిడెన్స్ అంతకంతకూ పెరిగిపోతోంది గులాబీ బాస్ కి. ఈ కారణంతోనే కావొచ్చు.. ఆయన ఊహకు అందలేని ఆర్డర్లు వేసేస్తున్నారు. తాజాగా అలాంటి ఆర్డర్ వేసి సంచలనంగా మారారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.

తాజాగా పంచాయితీరాజ్ శాఖపై హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న టీఎస్ ఆర్డీ లో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కారులో కీలకమైన శాఖల్ని చూసేవారంతా హాజరయ్యారు. ఇద్దరు.. ముగ్గురు మినహాయిస్తే.. మిగిలిన వారంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుస పెట్టి ఆర్డర్లు వేసిన కేసీఆర్ తీరుకు బెంబేలెత్తిపోతున్నారు అధికారులు.

ఎందుకంటే.. ఏ మాత్రం అమలు సాధ్యం కాని పనుల్ని ఆయన గడువు పెట్టి మరీ పూర్తి చేయాలన్న ఆదేశాన్ని ఎలా అమలు చేయాలన్నది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్య సేవకుడు అనే భావనతో తాను ఉన్నట్లు చెప్పటం వరకూ బాగానే ఉన్నా.. కేవలం 30 రోజుల వ్యవధిలో గ్రామాల ముఖచిత్రం మారిపోవాలన్నారు.

దసరా పండగ నాటికి గ్రామాల ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆదేశం జారీ చేశారు. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి హీరోలుగా మారి తమ తమ గ్రామాల్ని తీర్చిదిద్దుకోవాలన్న సూచనను చేవారు. ప్రజలే శ్రమదానం చేయాలన్న పిలుపునిచ్చారు. ఓట్లు వేసి.. పవర్ చేతికి ఇస్తే.. గ్రామాల్ని బాగు చేయాల్సింది పోయి.. మీ ఊరికి మీరే హీరోలు.. చెలరేగిపోండంటూ ఆయన చెప్పిన మాటల్ని విన్నోళ్లంతా ఉలిక్కిపడుతున్నారు.

అయితే.. అధికారులు లేదంటే గ్రామస్తులు తాను చెప్పిన పని చేయాలన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉన్నాయి. కేవలం 30 రోజుల్లో గ్రామాన్ని బొమ్మలా తయారు చేసే అవకాశం ఉంటే.. గడిచిన ఐదేళ్లలో ఇంకెంతలా తయారు చేయాలి? అలాద్దీన్ అద్భుత దీపం ఉంటే మాత్రమే సాధ్యమయ్యే పనుల్ని.. చాలా సింఫుల్ గా.. నోటి మాటతో పూర్తి చేయాలన్న కేసీఆర్ మాటను ఎలా నెరవేర్చాలన్నది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటివరకూ చూసిచూడనట్లుగా వ్యవహరించి.. ఒక్కసారిగా మార్పు రావాలన్న మాటలతో ప్రయోజనం ఉండదంటున్నారు. 30 రోజులన్నది చాలా తక్కువ సమయమని.. అంత స్వల్ప వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నింటిలోనూ రూపురేఖలు మార్చేయాలనటంలో సరికాదంటున్నారు. అలాద్దీన్ ఉంటే కానీ సాధ్యం కాని పనికి.. 30 రోజులిచ్చిన సారు ఆదేశాల్ని ఎలా అమలు చేయాలో అర్థం కాక కిందామీదా పడుతున్నారు ఉద్యోగులు.