Begin typing your search above and press return to search.

ఐదేళ్ల బాలుడికి కరోనా .. ఎలా సోకిందంటే !

By:  Tupaki Desk   |   16 April 2020 5:45 AM GMT
ఐదేళ్ల బాలుడికి కరోనా .. ఎలా సోకిందంటే !
X
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తుంది. జగిత్యాల మండలంలోని ఓ ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. దీనితో వెంటనే ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ బాలుడిని హుటాహుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ బాలుడికి కరోనా ఎలా సోకిందంటే .. ఏపీలోని గుంటూరు జిల్లా కేంద్రంలో బధిరులకు ఉచిత శస్త్ర చికిత్స చేస్తున్నారనే సమాచారం తెలుసుకొని బాలుడి తండ్రి అతడిని అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకున్న తరువాత రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులు స్వగ్రామానికి చేరుకున్నారు.

అయితే , ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న గుంటూరు నుండి రావడంతో స్థానికులు అధికారులకి సమాచారం ఇచ్చారు. దీనితో వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది. దీంతో బాలుడిని వెంటనే హైదరాబాద్ తరలించారు. తక్షణమే అవసరంలేని శస్త్ర చికిత్స కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాలుడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతడి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడు, అతడి కుటుంబాన్ని ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. తాజా కేసుతో జగిత్యాల జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

కాగా , ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గుంటూరు లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రాత్రికి మొత్తం 525 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. వీటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 122 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో బుధవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.ఇక 110 కేసులతో ఏపీలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది.