Begin typing your search above and press return to search.

కృష్ణాబోర్డుకు తెలంగాణ మ‌ళ్లీ లేఖ‌.. వివాదం ముదురుతుందా?

By:  Tupaki Desk   |   29 July 2021 9:28 AM GMT
కృష్ణాబోర్డుకు తెలంగాణ మ‌ళ్లీ లేఖ‌.. వివాదం ముదురుతుందా?
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన‌ జ‌ల వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఏపీ స‌ర్కారు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం అక్ర‌మంగా నిర్మిస్తోందంటూ తెలంగాణ లేవ‌నెత్త‌డంతో మొద‌లైన పంచాయితీ.. రోజురోజుకూ ముదురుతూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కృష్ణాబోర్డుకు రెండు రాష్ట్రాలూ లేఖ‌లు రాశాయి. అయినా.. ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఆ త‌ర్వాత కేంద్ర జ‌ల‌శ‌క్తికి, ప్ర‌ధానికి సైతం ఏపీ నుంచి లేఖ‌లు వెళ్లాయి. అయినా.. ప్ర‌ధాని మోడీ క‌నీసంగా కూడా స్పందించ‌లేదు. దీంతో.. ఇక త‌ప్ప‌ద‌ని సుప్రీం కోర్టును కూడా ఆశ్ర‌యించింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలో.. తాజాగా తెలంగాణ మ‌రోసారి కృష్ణా యాజ‌మాన్య బోర్డుకు లేఖ రాసింది.

ఏపీ అక్ర‌మంగా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల నిర్మిస్తోంద‌ని తెలంగాణ ఆరోపించింది. అనుమ‌తి లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంద‌ని ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ క్ర‌మంలోనే రెండు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఏపీ సుప్రీం మెట్లు ఎక్కింది. కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు ప‌రిధిని నోటిఫై చేయాల‌ని సుప్రీంను కోరింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. సాగు, తాగు కోసం వాడాల్సిన జలాలను సముద్రం పాలు చేస్తోందని, ఇది ప్రజల హక్కులను హ‌రించ‌డ‌మేన‌ని పేర్కొంది.

ఇటు తెలంగాణ కూడా మొద‌టి నుంచీ త‌న వాద‌న‌ను గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఎత్తిపోత‌ల ప‌థ‌కం అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టే విధించినా.. ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నార‌ని ఆరోపిస్తోంది. ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు కృష్ణా బోర్డును సైతం రానివ్వ‌లేద‌ని త‌ప్పు చూపిస్తోంది. జ‌ల విద్యుత్ ద్వారా ఏపీకి న‌ష్టం జ‌రుగుతుంద‌న్న వాద‌న‌ను సైతం తిప్పి కొట్టిన తెలంగాణ‌.. త‌మ వాటాగా ఉన్న జ‌లాల‌ను మాత్ర‌మే వినియోగించుకుంటున్నామ‌ని, ఏపీ చేస్తున్న వాద‌న‌ల్లో వాస్త‌వం లేద‌ని అంటోంది. ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం గెజిట్ జారీచేయ‌డం.. రెండురాష్ట్రాల్లోని ప్రాజెక్టుల‌ను కృష్ణా, గోదావ‌రి బోర్డులు నిర్వ‌హిస్తాని తేల్చి చెప్పడం జ‌రిగింది.

అయితే.. తాజాగా మ‌రోసారి తెలంగాణ అధికారులు కృష్ణాన‌దీ యాజ‌మాన్య బోర్డు చైర్మ‌న్ కు లేఖ రాశారు. కృష్ణా న‌దిలో రెండురాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల‌ను 50 - 50 వాటా ప్ర‌కారం కేటాయించాల‌ని కోరారు. మ‌రోసారి రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కృష్ణా నీటిని బేసిన్ ప‌రిధి దాటి ఏపీ మ‌ళ్లిస్తోంద‌ని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి త‌ర‌లింపున‌కు త్రిస‌భ్య క‌మిటీ ఆమోదం లేకుండా అనుమ‌తించొద్ద‌ని కోరారు.

అదేవిధంగా.. ఉమ్మ‌డి రాష్ట్రానికి బ‌చావ‌త్‌ట్రిబ్యున‌ల్ కేటాయించినవి 118 టీఎంసీలు అని చెప్పిన అధికారులు.. ఈ విష‌యాన్ని సుప్రీం కూడా దృవీక‌రించింద‌ని తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య పున‌ర్ కేటాయింపుల అంశాన్ని బ్రిజేష్ ట్రైబ్యున‌ల్ విచారిస్తున్నంద‌న.. ఈ ఏడాది (2021-22) నుంచి 50-50 నిష్ప‌త్తిలో నీటి కేటాయింపులు జ‌ర‌పాల‌ని కోరారు. ఇక‌, ఏపీ జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకుంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, కృష్ణా న‌దిలో నీళ్లు పుష్క‌లంగా ఉన్నందున అన్ని జ‌ల విద్యుత్ కేంద్రాల్లో ఉత్ప‌త్తి చేయ‌డానికి అనుమ‌తివ్వాల‌ని కోరారు.

కృష్ణా బేసిన్ దాటి నీటిని త‌ర‌లించ‌డానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోరారు. ఒక‌వేళ త‌ర‌లించాల‌ని అనుకుంటే.. బేసిన్ లో అవ‌స‌రాలు తీరిన త‌ర్వాత‌నే అనుమ‌తించాల‌ని పేర్కొన్నారు. మ‌రి, దీనిపై కృష్ణా బోర్డు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంది? అన్న‌ది చూడాలి.