Begin typing your search above and press return to search.

అక్క‌డ మాత్రం కాంగ్రెస్‌ కే ఎంఐఎం మ‌ద్ద‌తు!

By:  Tupaki Desk   |   29 Nov 2018 8:07 AM GMT
అక్క‌డ మాత్రం కాంగ్రెస్‌ కే ఎంఐఎం మ‌ద్ద‌తు!
X
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ పార్టీ టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఎంఐఎం అభ్య‌ర్థులు లేని చోట కారు గుర్తుకే ఓటెయ్యాల‌ని త‌మ మైనారిటీ వ‌ర్గాల‌కు పిలుపునిచ్చింది. ఇది అంద‌రికీ తెలిసిన సంగ‌తే క‌దా.. ఇందులో కొత్త విష‌య‌మేముంది అంటారా? ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం అందుకు నిరాక‌రించింది. అక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థికే తాము అండ‌గా నిల‌బ‌డుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిర్మ‌ల్ జిల్లాలో ముథోల్ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. ఇక్క‌డ టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి మ‌రోసారి బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌వార్ రామారావు ప‌టేల్ పోటీకి దిగారు. ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థికే మ‌జ్లిస్ త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఎంఐఎం జిల్లా అధ్య‌క్షుడు జ‌బ్బీర్ అహ్ద్ ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. గ‌త నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో విఠ‌ల్ రెడ్డి మైనారిటీల‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని మ‌జ్లిస్‌ ఆగ్ర‌హంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

ముథోల్‌ లో మైనారిటీ వ‌ర్గీయుల ఓట్లు అధిక సంఖ్య‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌జ్లిస్ ప్ర‌క‌ట‌న టీఆర్ ఎస్‌ కు మింగుడు ప‌డ‌టం లేదు. మైనారిటీల ఓట్లు దూర‌మైతే విఠ‌ల్ రెడ్డి గెలుపు అవ‌కాశాలు బాగా స‌న్న‌గిల్లుతాయ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. దీంతో స్థానిక నేత‌లు టీఆర్ ఎస్ అధిష్ఠానం దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకొచ్చార‌ట‌. ఎంఐఎం అగ్ర నాయ‌కులు అస‌దుద్దీన్ ఒవైసీ - అక్బ‌రుద్దీన్ ఒవైసీల‌తో మాట్లాడి ఎలాగోలా టీఆర్ ఎస్‌ కు ముథోల్‌ లో మ‌జ్లిస్ మ‌ద్ద‌తిచ్చేలా చూడాల‌ని విన్న‌వించార‌ట‌. మ‌రి పోలింగ్‌ కు మ‌రో 8 రోజులే ఉన్న ఈ ప‌రిస్థితుల్లో ఎంఐఎంతో టీఆర్ ఎస్ అధిష్ఠానం చ‌ర్చ‌లు జ‌రుపుతుందా? గులాబీ నేత‌లు కోరినా మ‌జ్లిస్ దిగివ‌స్తుందా? అనే విష‌యాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.