Begin typing your search above and press return to search.

హూజూరాబాద్ బై పోల్: ఉత్సాహంగా వస్తున్నారు.. నిరాశతో వెళుతున్నారు..

By:  Tupaki Desk   |   5 Oct 2021 5:30 PM GMT
హూజూరాబాద్ బై పోల్: ఉత్సాహంగా వస్తున్నారు.. నిరాశతో వెళుతున్నారు..
X
తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు హూజూరాబాద్ వైపే చూస్తోంది. ఇక్కడ ఈనెల1 ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయింది. 30న ఎన్నిక నిర్వహించి, నవంబర్ 2న లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు సజావుగా నిర్వహిస్తున్నారు. పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం లోపం ఉన్న సహించకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల పర్వం ఇప్పటికే మొదలైంది. దీంతో చాలా మంది ఉత్సాహ వంతులు హుజూరాబాద్ బరిలో దిగేందుకు వస్తున్నారు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో కొందరి నామినేషన్లను అంగీకరించడం లేదు. ఇక కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈనెల 30న ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈటల రాజేందర్ రాజీనామా తరువాత రోజు నుంచే ఇక్కడ రాజకీయం వేడేక్కింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరు ప్రకటించగా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఈనెల ఒకటో తేదీన నామినేషన్ వేయగా.. ఈటల రాజేందర్ 8న నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. అయితే సోమవారం ఈటల సతీమణి జమున తరుపున బీజేపీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు.

టీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ నర్సింగారావు పేరును ప్రకటించింది. వెంకట్ నర్సింగారావు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన కూడా 8న నామినేషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అయితే ప్రధాన పార్టీలతో పాటు చాలా మంది హూజూరాబాద్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కానీ సరైన ధ్రువ పత్రాలు లేదనందు వారిని అధికారులు వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఇక కరోనా నిబంధలను ఉల్లంఘించడంతో కొందరిపై కేసులు నమోదు చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేసేందుకు బయలు దేరారు. అయితే వీరు కరోనా నిబంధనలు ఉల్లంఘించి మాస్క్ లు ధరించకపోవడంతో వారిపై అధికారులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా జమ్మికుంటకు చెందిన ప్రజాయుక్త పార్టీ తరుపున సిలివేరు శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో ఈయన నామినేషన్ ను రిజెక్టు చేశారు. ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ వేసేదంుకు తాహెర్ కమాల్ కుంద్ మీరి వచ్చారు. కానీ సరైన ధ్రువ పత్రాలు సమర్పించలేదు. హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తానని నామినేషన్ వేశారు. అయితే పలు కారణాలతో అతని నామినేషన్ ఆమోదం పొందలేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు ఓం ప్రకాశ్ ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ తో కలిసి ఆయన హూజూరాబాద్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడారు. నామినేషన్ పత్రాల్లో చిన్న లోపం ఉన్న అనుమతించేది లేదని తెలిపారు. మరోవైప కరీంనగర్ పోలీస్ కమిషన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా వ్యహవరిస్తున్నారు. హుజూరాబాద్ వైపు వచ్చే వాహనాలను నిత్యం తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.