Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన టీ అసెంబ్లీ ర‌ద్దు ఫైలు!

By:  Tupaki Desk   |   7 Sep 2018 7:48 AM GMT
జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన టీ అసెంబ్లీ ర‌ద్దు ఫైలు!
X
అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌లేద‌నే చెప్పాలి. మీడియాలో అసెంబ్లీ ర‌ద్దుపై పెద్ద ఎత్తున క‌థ‌నాలు రావ‌టంతో పాటు.. ఎన్ని గంట‌ల‌కు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారు? గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ఎన్ని గంట‌ల‌కు భేటీ అవుతార‌న్న అంశాల‌న్నీ మీడియాలో మొద‌టే వ‌చ్చేశాయి.

ప్ర‌భుత్వం ఎలాంటి లీకులు ఇవ్వ‌న‌ప్ప‌టికీ ర‌ద్దు నిర్ణ‌యంపై వ‌చ్చిన వార్త‌ల కార‌ణంగా కేసీఆర్ నిర్ణ‌యం ఎవ‌రికి ఎలాంటి షాకివ్వ‌లేదు. నిజానికి అసెంబ్లీ ర‌ద్దు కంటే కూడా.. 105 మంది అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌టం పెను సంచ‌ల‌నానికి తెర‌తీయ‌ట‌మే కాదు.. రాజ‌కీయంగా పెద్ద కుదుపుగా మారింది. విప‌క్ష పార్టీల‌న్నీ ఒక్క‌సారిగా డిఫెన్స్ లో ప‌డిపోయిన ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం.. అనంత‌రం ర‌ద్దు అయిన‌ట్లుగా నోటిఫికేష‌న్ వెలువ‌డిన స్పీడ్ మాత్రం కొంద‌రి దృష్టిని తీవ్రంగా ఆక‌ర్షించింది.

తాను ముందుగా ఎవ‌రికి ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని కేసీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ.. అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన స‌మాచారం కొంద‌రు ఉన్న‌తాధికారుల వ‌ద్ద ఉంద‌ని చెబుతున్నారు.ఒక‌వేళ అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోతే.. వాయు వేగంతో అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యానికి సంబంధించిన ప‌త్రాలు సిద్ధం చేయ‌టం దగ్గ‌ర‌నుంచి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌టం.. ఆయ‌న వెంట‌నే సంత‌కం పెట్టేయంటంతో పాటు.. నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌టం చూస్తే..స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌టం సాధ్య‌మా? అన్న సందేహం రాక‌మాన‌దు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసే అంశానికి సంబంధించిన స‌మాచారాన్ని ఎవ‌రికి అందించ‌న‌ప్ప‌టికి కొంద‌రు అధికారుల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని సాంకేతికంగా పూర్తి చేయాల్సిన పేప‌ర్ వ‌ర్క్ ను మొత్తంగా ముందు రోజు డేట్ వేయించి సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌సారి కేసీఆర్ అధికారికంగా నిర్ణ‌యం తీసుకున్నంత‌నే గంట‌ల వ్య‌వ‌ధిలోనే అసెంబ్లీ ర‌ద్దు ప్ర‌క్రియ పూర్తి కావ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు నోటిఫికేష‌న్ కూడా విడుద‌లై.. ఆ స‌మాచారం ఎన్నిక‌ల సంఘానికి చేరిపోవ‌టం చూస్తే.. అసెంబ్లీ ర‌ద్దుపై కేసీఆర్ ఎంత ప‌క్కాగా ఉన్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.