Begin typing your search above and press return to search.

9 రోజులు సభ.. 8 రోజులు సెలవులు

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:42 AM GMT
9 రోజులు సభ.. 8 రోజులు సెలవులు
X
ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభను జరుపుకుందాం. ఎన్ని రోజులైనా మాకేం ఫర్లేదంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ జరిగే రోజులు.. సెలవులు చూస్తే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 10 వరకు సమావేశాలు జరుగుతున్నట్లు కనిపిస్తాయి. మొత్తంగా 18 రోజులు సభ జరగనున్నట్లు కనిపిస్తాయి. కానీ.. సెలవుల్ని తీసేస్తే.. సభ జరిగేది కేవలం 10 రోజులు మాత్రమే.

మొత్తం 18 రోజుల్లో అసెంబ్లీకి ఏకంగా ఎనిమిది రోజులు సెలవు దినాలు ఉండటంతో చాలా రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లు పైకి కనిపించినా వాస్తవం మాత్రం వేరుగా కనిపిస్తుంది. అసెంబ్లీని నిర్వహించే రోజుల విషయంలోనూ విపక్షాలు పెద్దగా అడ్డు చెప్పని పరిస్థితి. వాస్తవానికి వర్షాకాల సమావేశాలు ఏపీలో మాదిరి ఐదారు రోజుల్లో ముగించేస్తారేమోన్న సందేహాలు కలిగాయి. అయితే.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లుగా వ్యవహరించటం.. మొత్తం పది రోజుల పాటు సభ జరుగుతుండటంతో విషయాలన్నీ చర్చకు తీసుకురావటానికి అవసరమైన సమయం సరిపోతుందన్న భావన వ్యక్తమవుతోంది.

అయితే.. సభలో ఏం చర్చించాలన్న విషయానికి వస్తే.. అధికారపక్షం కొన్ని అంశాల మీద చర్చ జరిపేందుకు ససేమిరా అనటం కనిపిస్తే.. విపక్షాలు వాటి గురించి పట్టుబట్టటం కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్లు తీసివేయటం.. పార్టీ ఫిరాయింపులు.. లాంటి అంశాల మీద చర్చించేందుకు అధికారపక్షం నో చెప్పేసింది.

రైతుల ఆత్మహత్యలు.. విషజ్వరాలు.. నీటిపారుదల ప్రాజెక్టులు.. మిషన్ కాకతీయ.. ఇతర సంక్షేమ కార్యక్రమాలు.. బోధనా రుసుములు.. విశ్వవిద్యాలయాల దుస్థితి.. లాంటి అంశాలు చర్చకు వచ్చే వీలుంది. పలు అంశాల మీద చర్చకు తాము రెఢీ అంటూ అధికారపక్షం చెప్పేయటంతో.. రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్.. హాట్ గా సాగటం ఖాయం.