Begin typing your search above and press return to search.

అసెంబ్లీ షెడ్యూల్ ఖ‌రారు..ఉత్కంఠ‌కు తెర‌

By:  Tupaki Desk   |   5 Jan 2019 1:24 PM GMT
అసెంబ్లీ షెడ్యూల్ ఖ‌రారు..ఉత్కంఠ‌కు తెర‌
X
తెలంగాణలో కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు చెక్‌ప‌డింది. శాసనసభ సమావేశాలు షెడ్యూల్ ఖ‌రారైంది. జనవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్న్జర్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

మరుసటి రోజు నుంచి శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 17న ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ తర్వాత జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఉంటుంది.

17వ తేదీన స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు కూడా వుంటాయి. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తర్వాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. 19వ తేదీన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.