Begin typing your search above and press return to search.

జ‌రిగింది విలీనం కాదు.. జ‌స్ట్ చీలిక మాత్ర‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   8 Jun 2019 8:05 AM GMT
జ‌రిగింది విలీనం కాదు.. జ‌స్ట్ చీలిక మాత్ర‌మేన‌ట‌!
X
అవ‌స‌రానికి మించిన ఎమ్మెల్యేలు ఉన్నా.. అత్యాశ‌తో ఉన్న గులాబీ బాస్ తెలంగాణ‌లో విప‌క్షం అన్న‌ది లేకుండా చేయాల‌న్న కంకణం క‌ట్టుకోవ‌టం తెలిసిందే. తాజాగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్ లో క‌లిపేసుకోవ‌టం ద్వారా.. తెలంగాణ కాంగ్రెస్ ఉనికిని ప్ర‌శ్నార్థకంగా మార్చిన వైనం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. అదే స‌మ‌యంలో కేసీఆర్ స‌ర్కారు తీరుపై మండిప‌డుతూ ఆందోళ‌న బాట ప‌ట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు స‌మాయుత్తం అవుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనం అయ్యారా? అన్న సాంకేతిక ప్ర‌శ్న‌కు జ‌న‌సామ్యం చెబుతున్న స‌మాధానం అవున‌ని. కానీ.. టెక్నిక‌ల్ గా చూస్తే మాత్రం తెలంగాణ అధికార‌ప‌క్షంలో తెలంగాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం కాలేదన్న మాట వినిపిస్తోంది. అదెలా అంటే.. తాజాగా అసెంబ్లీ వెబ్ సైట్ తో ఇటీవ‌ల చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కొన్ని మార్పులు చేశారు. సీఎల్పీ విలీనం కాలేద‌ని.. కేవ‌లం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్ర‌మే టీఆర్ ఎస్ లో చేరిన‌ట్లుగా స్ప‌ష్ట‌త ఇచ్చింది. మిగిలిన ఆరుగురు కాంగ్రెస్ త‌ర‌ఫునే అసెంబ్లీలో కొన‌సాగుతున్న‌ట్లుగా పేర్కొంది.

అయితే.. కాంగ్రెస్ కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా గ‌ల్లంతు అయింది. ఏ పార్టీ త‌ర‌ఫున ఎంత‌మంది స‌భ్యులున్నార‌న్న విష‌యాన్ని తెలంగాణ అసెంబ్లీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అందులో టీఆర్ఎస్ నుంచి 100 మంది (12 మంది కాంగ్రెస్ స‌భ్యులు చేరిన త‌ర్వాత‌).. మ‌జ్లిస్ నుంచి ఏడుగురు.. కాంగ్రెస్ త‌ర‌ఫున ఆరుగురు.. టీడీపీ నుంచి ఇద్ద‌రు.. బీజేపీ.. ఫార్వ‌ర్డ్ బ్లాక్ నుంచి ఒక్కొక్క‌రు.. స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఒక‌రు ఉన్న‌ట్లుగా వెబ్ సైట్ పేర్కొంది. మ‌రో స్థానం ఖాళీగా(ఇటీవ‌ల ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం) ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది.

అంద‌రూ అనుకున్న‌ట్లుగా సీఎల్పీ విలీనం కాద‌ని..కేవ‌లం పార్టీలో చీలిక‌గా మాత్ర‌మే చెబుతున్న‌క్ర‌మంలో ఇది చెల్లుతుందా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ‌ను విలీనం చేయాలంటూ స్పీక‌ర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ‌ను బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌క‌పోవ‌టంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాంకేతికంగా త‌ప్పులు ఉండే అవ‌కాశం ఉండ‌టంతోనే.. ఈ అంశాలు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు లేఖ‌ను బ‌య‌ట‌పెట్ట‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై స్పీక‌ర్ పేషీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.