Begin typing your search above and press return to search.

కీలక సన్నివేశానికి వేదికగా టీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు?

By:  Tupaki Desk   |   7 Sep 2020 4:30 AM GMT
కీలక సన్నివేశానికి వేదికగా టీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు?
X
కరోనా వేళ.. తొలిసారి జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయా? భవిష్యత్తు రాజకీయ పరిణామాలకే వేదికగా నిలవనున్నాయా? ఈ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయనున్నాయా? అంటే.. ఆ అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

కేంద్రం తీరుపై గుర్రుగా ఉన్న ఆయన.. ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించటమే కాదు.. మోడీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో తన ప్రయాణం ఎలా సాగనుందన్న విషయాన్ని తాజా సమావేశాల్లో స్పష్టం చేసే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాల్ని తొలుత అనుకున్నట్లుగా మూడు వారాల పాటు నిర్వహించాలా? వద్దా? అన్న విషయాన్ని కూడా డిసైడ్ చేయనున్నారు.

ఇప్పటికే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నామ జపం చేయటమే కాదు.. ఆయన శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. ఈ అంశంపై అసెంబ్లీలో ఒక రోజు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఉతికి ఆరేయటం ఖాయమని చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను టచ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలకు అవకాశం ఉందంటున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. జాతీయ పార్టీ ఏర్పాటులో కీలకభూమిక పోషించనున్న కేసీఆర్.. తన ఫ్యూచర్ జర్నీకి సంబంధించిన కీలక ప్రకటన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేయటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. తాజా వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో ల్యాండ్ మార్కుగా మిగులుతాయని చెబుతున్నారు. ఏమైనా.. మిగిలిన సమావేశాలకు భిన్నంగా తాజా సమావేశాలు సాగుతాయన్న మాట వినిపిస్తోంది.