Begin typing your search above and press return to search.

అవసరమైతే అలా ఎత్తి అవతల పడేస్తారంట

By:  Tupaki Desk   |   23 Sep 2015 4:46 AM GMT
అవసరమైతే అలా ఎత్తి అవతల పడేస్తారంట
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో వివిధ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనేది తర్వాత.. ముందస్తుగానే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే. పార్టీ సహచరులతో కలిసి సమావేశాన్ని నిర్వహించిన ఆయన.. ఏ పార్టీ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. విపక్షాలతో దేనికైనా రెఢీ అన్నట్లుగా ఉండటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో పార్టీలు ఎలా వ్యవహరించే అవకాశం ఉందన్న విషయంలో ముఖ్యమంత్రి చేసిన విశ్లేషణ చూస్తే.. మజ్లిస్ తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. వామపక్షాలకు పెద్దగా బలం లేదని.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పినట్లు చెబుతున్నారు.

ఇక.. బీజేపీ విషయానికి వస్తే.. వారు ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. హద్దుల్లోనే ఉండే అవకాశం ఉంటుందే తప్ప.. సభ నుంచి బయటకు వెళ్లాలన్నట్లుగా వ్యవహరించరని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక.. కాంగ్రెస్.. తెలంగాణ తెలుగుదేశం పార్టీల విషయానికి వస్తే.. వారు కానీ ఎక్కువ చేస్తే కంట్రోల్ చేద్దామని.. ఒకవేళ హద్దులు దాటితే ఎత్తి అవతల పడేద్దామని.. సభను సజావుగా జరుపుకుందామని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అంటే.. సభను స్తంభించేలా వ్యవహరించే పార్టీ నేతల పట్ల తీవ్ర స్థాయిలో స్పందించటం ఖాయమన్న ధోరణి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చూస్తే అర్థమవుతుంది. మాటలే ఇంత కఠినంగా ఉంటే.. చేతలు మరెంత కఠినంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదేమో. సో.. తెలంగాణ అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తున్న విపక్షాలకు.. కేసీఆర్ కరుకు వైఖరి ఎంతలా ఇబ్బంది పెడుతుందో చూడాలి.