Begin typing your search above and press return to search.

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎందుకంటే..

By:  Tupaki Desk   |   27 April 2017 12:25 PM GMT
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎందుకంటే..
X
తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం భూసేకరణలో జాప్యం జరుగకుండా ఉండేందుకు రూపొందించిన భూసేకరణ చట్టానికి నాలుగు సవరణలు చేయాలని కేంద్రం సూచించిన నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు శాసనసభ - మధ్యాహ్నం 3 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు బీఏసీ(శాసనసభా వ్యవహారాల సంఘం) సమావేశం అసెంబ్లీ ఆవరణలో జరగనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై చర్చించనున్నారు. ప్రత్యేక సమావేశాల్లో భూసేకరణ చట్టసవరణ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కాగా బాధితులకు పరిహారం అందించడంలో ఎలాంటి జాప్యం జరుగకుండా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చట్టం ప్రకారం నడుచుకునేలా ప‌లు సవరణలు చేపట్టాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ సవరణలు పూర్తికాగానే బిల్లును వెంటనే ఆమోదిస్తామని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. భూములు కోల్పోయే బాధితులకు భూసేకరణ చట్టం-2013 నిర్దేశించిన దానికంటే తక్కువ కాకుండా ఎక్కువ పరిహారం లభించేలా రాష్ట్ర చట్టం ఉండాలని కేంద్రం సూచించింది. ఆ మేరకు తెలంగాణ భూసేకరణ సవరణ చట్టం-2016కు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కీలకమైన మార్పులు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

1) కేంద్రం సూచన మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌ లో నోటిఫై చేసిన నాటినుంచే చట్టం అమలులోకి వస్తుంది అని పొందుపరిచిన క్లాజ్‌ ను తీసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఈ చట్టం రాష్ట్ర విభజన జరిగిన రోజునుంచి అమలులోకి వస్తున్నట్టుగా ఉంటుంది.

2) సమాచారం సేకరించి మార్కెట్ విలువను నిర్ణయించాలంటూ చేసిన సవరణను కేంద్రం అంగీకరించలేదు. రాష్ట్రం రూపొందించిన చట్టంలో పేర్కొన్న నిర్ణయించు అనే పదం కేంద్ర భూసేకరణ చట్టం-2013 స్ఫూర్తికి భిన్నంగా ఉందని భావించింది. కేంద్రం సూచన మేరకు ఆ పదాన్ని తొలిగించినట్టు తెలిసింది. భూములు కోల్పోయినవారికి సవరించిన మార్కెట్ ధరల ప్రకారంగానే పరిహారం ఇస్తామని తెలుపనున్నట్టు సమాచారం.

3) భూసేకరణలో బాధితులకు - ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం - పునరావాసం కేంద్రం రూపొందించిన భూసేకరణ చట్టం-2013 కంటే తక్కువ కాకుండా ఇస్తామని మార్పు చేయనున్నట్టు తెలిసింది. అలాగే ఏకమొత్తం చెల్లింపుల్లో కూడా రైతులతో మాట్లాడి వారి అంగీకారం మేరకు ఇచ్చే పరిహారం కేంద్ర చట్టం కంటే ఎక్కువగానే ఉంటుంది కాని తక్కువ ఉండదని ప్రత్యేకంగా బిల్లులో చేర్చనున్నట్టు సమాచారం. జిల్లా కలెక్టర్లు మాట్లాడి భూమిని సేకరించడం కూడా చట్టానికి లోబడే ఉండాలని చేర్చనున్నారు.

4) పార్లమెంటు అనుమతితో సంబంధం లేకుండా కేవలం కేంద్రం అనుమతితో భూసేకరణ చేయవచ్చునని సవరణ చట్టం 10వ సెక్షన్‌ లో పేర్కొనడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తంచేసింది. భూసేకరణకు పార్లమెంటే ఫైనల్ అవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు దానిని సవరించినట్టు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/