Begin typing your search above and press return to search.

‘జీ ఎస్’టీ అన్న తెలంగాణ అసెంబ్లీ

By:  Tupaki Desk   |   30 Aug 2016 10:16 AM GMT
‘జీ ఎస్’టీ అన్న తెలంగాణ అసెంబ్లీ
X
రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉండటం చాలా కష్టమంటారు. కానీ..ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ జరిగిన తీరు చూసిన తర్వాత.. మన పాలకులు అనుకోవాలే కానీ ఏమైనా చేయగలరన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. అసెంబ్లీ సమావేశం అన్న వెంటనే విమర్శలు.. ప్రతివిమర్శలు.. నినాదాలు.. వాకౌట్లు ఇలా చాలానే గుర్తుకు వస్తాయి. కానీ.. ఒక బిల్లును ఆమోదించాలన్న లక్ష్యంతో అన్నీ పార్టీలు అనుకోవాలే కానీ ఆ పనిని ఎంత బుద్ధిగా చేస్తారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన జీఎస్టీ బిల్లుకు ‘జీ.. ఎస్’ అంటూ తెలంగాణ అసెంబ్లీ ఓకే చెప్పేసింది. ఈ బిల్లుకు ఆమోదం చెప్పేందుకు ప్రత్యేకంగా కొలువు తీరిన తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లు ముచ్చట చెప్పుకొచ్చారు. అందరికి తెలిసిన విషయాల్నే చెప్పిన ఆయన.. బిల్లుకు తన మద్దతును చెప్పేశారు.

అధికారపక్షం తర్వాత విపక్షాలు.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున పార్టీలు జీఎస్టీ బిల్లు గురించి వివరంగా చెప్పుకొచ్చారు. కొన్ని పార్టీలైతే బిల్లును పొగిడేస్తే.. మరికొన్ని పార్టీలు బిల్లుకు ఆమోదముద్ర పడటం ఖాయమన్న రీతీలో మమ అని పూర్తి చేశాయి. ఇక.. తెలంగాణ బీజేపీ నేతలైతే జీఎస్టీ బిల్లు చట్టం రూపం దాలిస్తే.. జనాల బతుకుల్లో పెద్ద మార్పు వస్తుందన్న రీతిలో గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఆమోద ముద్ర వేసేయాలన్న మైండ్ సెట్ తో వచ్చిన పార్టీలు.. అందుకు తగ్గట్లే ఓకే చెప్పేసి బిల్లును ఆమోదించాయి. జీఎస్టీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తానే ముందుండాలనుకునే కేసీఆర్ కు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించి పంపటానికి మించిన సంతోషం ఇంకేం ఉంటుంది. జీఎస్టీ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులకు సైతం తెలంగాణ అసెంబ్లీ ఓకే చెప్పేసింది.