Begin typing your search above and press return to search.

ఈసారి గోల్కొండ కాదు.. పరేడ్ గ్రౌండ్స్..?

By:  Tupaki Desk   |   27 July 2015 4:10 AM GMT
ఈసారి గోల్కొండ కాదు.. పరేడ్ గ్రౌండ్స్..?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర వేడుకల్ని గోల్కొండలో నిర్వహించటం తెలిసిందే. గోల్కొండ ఖిల్లా మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు పలు నాటకీయ పరిణామాల్ని తెలంగాణ సర్కారు ఎదుర్కొంది కూడా. నూతన ఒరవడి సృష్టించేలా ఆగస్టు 15 వేడుకలు ఇకపై గోల్కొండ కోట మీద నిర్వహించనున్నట్లుగా అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు కూడా.

అయితే.. మరో రెండు వారాల వ్యవధిలో రానున్న ఆగస్టు 15 వేడుకల్ని తెలంగాణ సర్కారు గోల్కొండలో నిర్వహించటం లేదని చెబుతున్నారు. గత ఏడాది మాదిరి.. వేడుకలు గోల్కొండ కోటలో కాకుండా.. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోనే చేపడతారని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్టు 15.. జనవరి 26 తేదీల్లో నిర్వహించే వేడుకల్ని పరేడ్ గ్రౌండ్స్ లో చేపట్టే వారు.

ఇందుకు భిన్నంగా తనదైన మార్క్ తో గోల్కొండలో నిర్వహించేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈసారి మాత్రం ఆగస్టు 15 వేడుకల్ని గోల్కొండ ఖిల్లా మీద నుంచి కాకుండా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేలా అధికారులు తమ పనులు మొదలు పెట్టారని చెబుతున్నారు. గోల్కొండ కోట నుంచి వేడుకల్ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారన్న దానికి ఆసక్తికరమైన సమాధానం లభిస్తోంది.

లాజిస్టిక్ సమస్య కారణంగా వేడుకల వెన్యూను మారుస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే.. ఈ లాజిస్టిక్స్ ఏమిటన్న విషయాన్ని మాత్రం వివరించకపోవటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించటానికి కేంద్రం నుంచి పర్మిషన్లు తీసుకోవటం ఇబ్బందికరంగా మారటం.. అదే సమయంలో పెరేడ్ గ్రౌండ్స్ లో వేడుకల్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా ఆసక్తి లేని నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భారీ ఎత్తున ఉన్న ఖాళీ స్థలాల్ని ఇలాంటి కార్యక్రమాల కోసం వినియోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను అధికారులు దృష్టి సారించినప్పటికీ.. దీనిపై కేసీఆర్ ఆసక్తి ప్రదర్శించలేదని చెబుతున్నారు. గోల్కొండ కోటలో వేడుకల నిర్వహణకు రక్షణ శాఖ నుంచి అనుమతుల తలనొప్పితో పాటు.. ఆశించినంతగా

ఘనంగా ​వేడుకలు నిర్వహించకపోయామన్న భావన తెలంగాణ ప్రభుత్వంలో ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అందుకే.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి.. నగరం నడిబొడ్డున ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో ఆగస్టు 15 వేడుకల్ని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.