Begin typing your search above and press return to search.

సొంత రాష్ట్రం కార్డుల‌తో ప‌క్క రాష్ట్రంలో రేష‌న్‌!

By:  Tupaki Desk   |   27 July 2019 7:41 AM GMT
సొంత రాష్ట్రం కార్డుల‌తో ప‌క్క రాష్ట్రంలో రేష‌న్‌!
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే దేశం - ఒకే సారి ఎన్నికలు అనే నినాదంతో 2022లో జ‌మిలీ ఎన్నికలు నిర్వహించాలని పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నారు. ఈ తరహాలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకే దేశం - ఒకే కార్డు పథకానికి కేంద్రం రూపకల్పన చేయనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణలో రేషన్ కార్డు దారులు ఏ ప్రాంతంలో అయినా రేష‌న్ తీసుకునే అవకాశాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కల్పించింది. ఈ క్రమంలోనే ఒకే దేశం - ఒకే కార్డు పథకం ఆగస్టు 1 నుంచి నాలుగు రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు.

ఈ పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి హైదరాబాద్‌ లో నివాసం ఉంటోన్న‌ ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లు అక్క‌డ రేష‌న్ తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ‌లో చాలా మంది పేద‌లు పొట్ట‌కూటికోసం హైదరాబాద్ వ‌చ్చి ఇక్క‌డ చిన్న‌చిన్న ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఇక్క‌డ స్థానికంగా వారికి రేష‌న్ కార్డు లేక‌పోవ‌డంతో వారు రేష‌న్ కోల్పోతున్నారు. మారిన రేష‌న్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఇప్పుడు వారు ఇక్క‌డ రేష‌న్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇక ఏపీలో తెలంగాణ వాళ్లు ఎవ‌రైనా ఉంటే వారు కూడా ఇక్క‌డ రేష‌న్ తీసుకోవ‌చ్చు. తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ‌ - ఖ‌మ్మం జిల్లాల‌కు చెందిన చాలా మంది విజ‌య‌వాడ‌తో పాటు రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చి ప‌నులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారు కూడా త‌మ రాష్ట్రానికి చెందిన కార్డుతో ఇక్క‌డ రేష‌న్ తీసుకోవ‌చ్చు. ఓవ‌రాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎవ‌రు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్క‌డైనా రేష‌న్ మిస్ అవ్వ‌క్క‌ర్లేదు.