Begin typing your search above and press return to search.

భైంసా ఎలా ఉంది? సోమవారం ఏమేం జరిగాయి?

By:  Tupaki Desk   |   9 March 2021 4:30 AM GMT
భైంసా ఎలా ఉంది? సోమవారం ఏమేం జరిగాయి?
X
చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన భైంసా.. తెలంగాణలోని కేసీఆర్ కు మరో తలనొప్పిని తెచ్చి పెట్టింది. గతంలో భైంసాలో జరిగిన అల్లర్ల మరక నుంచి బయటపడిన టీఆర్ఎస్ సర్కారుకు తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు ప్రతిపక్షాలకు పదునైన ఆయుధాలుగా మారుతాయన్న మాట వినిపిస్తోంది. ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో మొదలైన ఘర్షణల్ని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులకు రెండున్నర గంటల సమయం పట్టినట్లుగా చెబుతున్నారు. టూ వీలర్లు.. ఆటోలు.. కార్లను తగలబెట్టటంతో పాటు.. ఇళ్లకు నిప్పు అంటించిన ఉదంతాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఘర్షణలు చోటు చేసుకున్న రెండు వర్గాల్లోని వారికే కాదు.. పోలీసులు.. జర్నలిస్టులు సైతం కత్తిపోట్లకుగురి కావటం.. వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. అల్లరి మూకలు రెండు వర్గాలుగా వీడిపోవటం.. పరస్పరం రాళ్లు రువ్వుకోవటం.. కత్తులు.. ఇనుపరాడ్లతో చెలరేగిపోయిన వైనం షాకింగ్ గా మారింది.

భైంసా ఘర్షణలపై జిల్లా కలెక్టర్ ఎస్సీలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు ఈ పట్టణమంతా మొహరించారు. వారంతా మకాం వేసి.. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రయత్నించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ముషారఫ్ అలీ ఫారూకి ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాన్ని సందర్శించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సోమవారం భైంసాలో 144వ సెక్షన్ అమలు చేయటంతో పట్టణ ప్రాంతమంతా నిర్మానుష్యంగా కనిపించింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార.. వాణిజ్య సముదాయాల్ని తెరవలేదు. ప్రభుత్వ.. ప్రైవేటు పాఠశాలలు.. కాలేజీల్ని మూసి ఉంచారు. పట్టణంలోనికి కొత్తవారిని అనుమతించలేదు. ఘర్షణలతో సంబంధాలు ఉన్నట్లుగా భావిస్తున్న 28 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా మరింతమందిపై చర్యలు తప్పవంటున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఆరు బైకులు.. రెండు ఆటోలు.. రెండు కార్లతో పాటు 16 షాపులు తగలబడిపోయాయి. ఏడు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. దాదాపు పదమూడు మంది గాయాలు పాలు కాగా.. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు. గతంలోఅల్లర్లు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ప్రస్తుతానికి పోలీసుల నిర్భందంలో భైంసా ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదేమీ కాదని.. నివురు గప్పిన నిప్పులా ఉందన్న మాట కొందరి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. భైంసాలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీసినట్లు చెబుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన అమిత్ షా.. వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. భైంసా ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితి ఎలా ఉందన్న వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. భైంసాలో జరిగిన హింసను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.