Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ సరికొత్త ప్లాన్

By:  Tupaki Desk   |   27 Sep 2021 2:59 PM GMT
తెలంగాణ బీజేపీ సరికొత్త ప్లాన్
X
తెలంగాణ బీజేపీ సరికొత్త ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమైంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే కీలక ప్రకటన చేయడానికి రెడీ అయ్యింది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.. వ్యూహం అమలు చేయడానికి రెడీ అయ్యింది. బండి సంజయ్ తలపెట్టిన వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.

తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్ గా కమలనాథులు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. హైకమాండ్ నుంచి కూడా ఫుల్ సపోర్టు లభిస్తుండడంతో సరికొత్త ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ జనాల్లోకి వెళ్లారు. త్వరలోనే తొలి విడత పాదయాత్ర ముగియనుంది. ఈలోపే కీలక ప్రకటనకు స్కెచ్ వేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అన్ని పార్టీల కంటే ముందే బండి సంజయ్ జనంలోకి వెళ్లారు. 5 విడతల్లో సంగ్రామయాత్రకు ప్లాన్ చేసుకున్నారు.

చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు తొలి విడత.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర ముగిసింది. సిరిసిల్ల మీదుగా హుజూరాబాద్ వరకు కొనసాగుతోంది. అక్టోబర్ 2న మొదటి విడత పాదయాత్ర ముగిస్తారు.

అక్టోబర్ 2న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలోనే 20 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట కమలనాథులు.. ఎటువంటి సమస్యలేని పెద్దగా ఆశావహులు లేని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట..

పాదయాత్ర విజయవంతానికి కృషి చేసిన వారికి గుర్తింపుగా ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలని బండి సంజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర సాగిన జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అయితే హైకమాండ్ నుంచి అనుమతి రాలేదు.