Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ అంతర్మథనం

By:  Tupaki Desk   |   25 Dec 2018 5:03 AM GMT
తెలంగాణ బీజేపీ అంతర్మథనం
X
ఎంతో ఊహించుకున్నారు.. తెలంగాణలో ప్రత్యామ్మాయం తామేనన్నారు. కానీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి లాంటి బలమైన నేతలు కూడా టీఆర్ఎస్ హోరుకు కొట్టుకుపోయాక అసలు విషయం బీజేపీ నేతలకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా 5 ఏళ్లదాకే ఏం ప్రయోజనం లేదు. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం బీజేపీ నేతలను కలవరానికి గురి చేసింది. పార్టీలోని ప్రధాన నేతలు ఓటమి చవి చూడడంతో రాష్ట్ర బీజేపీలో అంతర్మథనం మొదలైంది. టీఆర్ఎస్ కు తోక పార్టీగా వ్యవహరించడంతోనే ఓటమి పాలయ్యామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాల్లో విమర్శించినా టీఆర్ఎస్ కు తోక పార్టీగా ఉన్న పేరు తమ ఓటమి కారణమైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారట. మరోవైపు ఎన్నికల్లో ఫలితాలకు బాధ్యత వహిస్తూ లక్ష్మణ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షాను కలవరానికి గురి చేసింది.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భారతీయ జనతా పార్టీని కష్టాల్లోకి నెట్టినైంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పై సమీక్షించేందుకు వచ్చిన బీజేపీ అగ్ర నేతల ముందు ఆ పార్టీ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు చెప్పిన కారణాలు ఏవైనా లోపాయకారంగా టీఆర్ఎస్ తో వ్యవహరిస్తున్న తీరుతో ఓడిపోయామని, జాతీయ రాజకీయాల కోసం తమను బలి చేశారని వాపోయారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హైకమాండ్ కు సందేశం పంపారు. దీన్ని చూసిన అమిత్ షా కలవరపడ్డారు. ఎందుకంటే తెలంగాణకు బాధ్యత వహిస్తూ లక్ష్మణ్ రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేయాల్సి వస్తుందనేది అమిత్ షా పాయింట్.

ఇక్కడ రాజీనామా చేస్తే నాలుగు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు రాజీనామా చేయాల్సి వస్తుందని, అది పార్టీకి మంచిది కాదని అమిత్ షా అన్నట్లు నేతలు చెబుతున్నారు. మరోవైపు విజయం సాధించినప్పుడు గెలుపునకు కారణం తామేనని చెప్పుకునే మోదీ, అమిత్ షా ఓటమి పై స్పందించకపోవడంతో సొంతపార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామాలు ప్రారంభమైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చాల్సి వస్తుంది. ఈ సమయంలో రాజీనామాలు వద్దని బీజేపీ వర్గాలు చెబుతున్నా లక్ష్మణ్ ను మాత్రం మార్చాల్సిందేనంటూ కొంతమంది నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాల కోసం బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నాయకులను చిన్న చూపు చూస్తున్నారనే ప్రతీ ఒక్కరిలో ఉంది. తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అమిత్ షా చెప్పినా టీఆర్ఎస్ కోసం బలి చేశారని భావిస్తున్నారు. వెంటనే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండడంతో తెలంగాణ పార్టీ కనుమరుగు అవుతుందనే ఆందోళన వారిలో మొదలైంది. మరోవైపు అమిత్ షా రాక కూడా వాయిదాపడింది.