Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఇక క్ష‌మించేద్దాం అంటున్న బీజేపీ

By:  Tupaki Desk   |   6 March 2018 5:44 AM GMT
కేసీఆర్‌ ను ఇక క్ష‌మించేద్దాం అంటున్న బీజేపీ
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ‌రుస‌గా టార్గెట్ చేసిన క‌మల ద‌ళం ఇక దీనికి బ్రేక్ వేసేందుకు సిద్ధ‌మైంది. ఆయ‌న్ను క్ష‌మించాల‌ని బీజేపీ సిద్ధ‌మైంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ నిర్ణ‌యానికి ముందు త‌మ‌దైన శైలిలో ఆందోళ‌న చేప‌ట్టింది. మోడీపై విమ‌ర్శ‌లు చేసిన తీరుకు నిర‌స‌నగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ `ప్రగతి భవన్‌ ముట్టడి`కి సిద్ధ‌మైంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ - శాసనసభాపక్షనేత జి కిషన్‌రెడ్డి - ఎమ్మెల్యే రాజాసింగ్‌ లను ఉదయం 8 గంటలకే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మరో ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఆటోలో ప్రగతి భవన్‌ వద్దకు వెళ్తుండగా పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకొని అరెస్టు చేసి - గోషామహల్‌ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డి తదితరుల్ని పంజాగుట్టలోని రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద అడ్డుకొని అరెస్టులు చేశారు. ఎమ్మెల్సీ ఎన్ రామ‌చంద్రరావును ముందస్తుగా అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

అయితే బీజేవైఎమ్‌ కు కార్యకర్తలు కొందరు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి - అకస్మాత్తుగా ప్రగతిభవన్‌ గేట్లను దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వారందరినీ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చిక్కడపల్లిలోని తన కార్యాలయంలో ఉన్న ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ ను పోలీసులు బలవంతంగా ఆయన ఇంటికి తీసుకెళ్లి నిర్భంధించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ నిరంకుశ - నియంతృత్వ నిజాం నవాబుకు... సీఎం కేసీఆర్‌ కు ఎలాంటి తేడా లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న తమను - కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పే వరకు తమ పోరాటం ఆగదని - సీఎం ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

ఈ భేటీ అనంత‌రం బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం జ‌రిగింది. ప్రధాని మోడీని అవమానిస్తూ తానేమి మాట్లాడలేదని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతున్నందున...ఇకపై ఆవిషయాన్ని వదిలేయాలని సోమవారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించారు.