Begin typing your search above and press return to search.

ఆ 'స్వామి'తో వేగలేకపోతున్నారట..

By:  Tupaki Desk   |   30 Nov 2018 11:33 AM GMT
ఆ స్వామితో వేగలేకపోతున్నారట..
X
ఎన్నికల ముగింపు దశలో టీబీజేపీ నేతలకు పెద్ద సమస్య వచ్చి పడింది. స్వామి పరిపూర్ణానంద వల్ల చులకన భావం ప్రజల్లో కలుగుతోందని, ఆయనతో వేగలేకపోతున్నామని టీబీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా అనేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న ఉన్న తమను లెక్కచేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల తెలంగాణ ఎన్నికలు మొదలైన కొన్ని రోజుల తరువాత అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు పరిపూర్ణానంద. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆయన వేలు పెట్టడంతో.. చిర్రెత్తుకొచ్చిన స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ చెక్ పెట్టే పనిలో పడిపోయారని వార్తలు బయటకు పొక్కాయి.. కానీ చివరకు పరిపూర్ణానంద పోటీ చేస్తారనుకున్న స్థానాన్ని ఇంకొంకరికి కట్టబెట్టడంలో లక్ష్మణ్ విజయం సాధించారు.

టీఆర్ ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బాబు మోహన్ వంటి సీనియర్ నేతలు చేరిక సమయంలోనూ టీ బీజేపీ శ్రేణులు వెంట ఉన్నారు. కానీ, పరిపూర్ణానంద చేరే సమయంలో ఆయన వెంట ఎవరూ లేరు. పైగా ఆయనే సీఎం అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే స్వామి పోటీ చేయడం లేదు. కానీ, నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అందరినీ ఒకతాటి పైకి తీసుకువస్తే సమస్య ఉండదని.. కానీ, పార్టీ నేతల మధ్య విభేదాలను ఆయనే నూరిపోస్తున్నాని బీజేపీ సీనియర్లు లోలోపల రగిలిపోతున్నారట...

దీనిపై ఫిర్యాదు చేయాలన్నా అమిత్ షా అందుబాటులోకి రావడం లేదట టీబీజేపీ శ్రేణులకు. అయితే, ఇటీవల పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సీనియర్ నేతలకు సమయం కేటాయించకుండా కేవలం పరిపూర్ణానందతోనే భేటీ అవడంపై టీబీజేపీ నేతలు రగిలిపోతున్నారట... తెలంగాణ ఎన్నికల్లో 70 స్థానాలు వస్తాయని ఒకసారి, కింగ్ మేకర్ అవుతామని మరోసారి విరుద్ధ ప్రకటనలు చేస్తూ స్వామి పార్టీ పరువు తీస్తున్నారని అంటున్నారు. బలాన్ని బట్టి మాట్లాడితే సరిపోతుంది కదా అని చెబుతున్నారు. అమిత్ షాకు సన్యాసులంటేనే ఇష్టమా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముగిసిన తరువాత.. ఈ లుకలుకలు మరింత మండిపోయే అవకాశం లేకపోలేదని పార్టీ శ్రేణులే చెబుతుండటం విశేషం.