Begin typing your search above and press return to search.

ఓటమి వారికి వరంగా మారిందే.. ఆ ఇద్దరు నేతల సుడే సుడి

By:  Tupaki Desk   |   31 May 2022 2:30 PM GMT
ఓటమి వారికి వరంగా మారిందే.. ఆ ఇద్దరు నేతల సుడే సుడి
X
ప్రతిభ ఉండగానే సరికాదు. దానికి కాసింత లక్ తోడు కావాలి. లేకుంటే ఎంతటి మొనగాడైనా సరే ఎదురుదెబ్బలు తప్పవు. ఈ తీరు మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో పరిస్థితులు ఎంత అనూహ్యంగా మారిపోతాయంటే.. టికెట్ ప్రకటించి.. బీఫారమ్ చేతికి తీసుకునే లోపు అభ్యర్థులు మారిపోయిన సందర్భాలు ఎన్నో. అలానే పక్కాగా గెలుపు అని ధీమాగా ఉన్న నేతల ఎన్నికల ఫలితాలు పోలింగ్ ముందు రోజు చోటు చేసుకునే పరిణామాలతో మారిపోవటం చాలానే చేసి ఉంటాం.

సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలై.. ఫ్యూచర్ సంగతేమిటన్నదిగులులో ఉన్న వారికి కాలం వరంగా మారిన ఉదంతం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కొన్ని నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయటం ద్వారా 2018 చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ బీజేపీకి చెందిన కీలక నేతలు లక్ష్మణ్.. కిషన్ రెడ్డిలు ఇద్దరూ ఓటమిపాలు కావటం తెలిసిందే. ఈ ఫలితాలు వారిని తీవ్ర నిరాశకు గురి చేశాయి. వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

ఇలాంటి వేళ.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డిని ఎంపిక చేయటం.. మోడీ వేవ్ తో ఆయన విజయం సాధించటం ఒక ఎత్తు అయితే..మోడీ మంత్రివర్గంలో చోటు కల్పించటం ద్వారా ఆయనకు ముందు ఎదురైన ఓటమి డబుల్ థమాకాగా మార్చింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. కేంద్ర మంత్రి పదవి అవకాశాన్ని చేజార్చుకునే వారని చెప్పాలి.

ఇక..లక్ష్మణ్ విషయానికి వస్తే తెలంగాణ సీనియర్ నేతగా పేరున్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా నిరాశకు గురైనప్పటికీ ఆయన్ను జాతీయ ఓబీసీ మోర్చాకు అధ్యక్షుడగా చేయటం ద్వారా సముచిత స్థానం లభించినట్లైంది. అయితే.. పార్టీకి చేస్తున్న సేవకు ప్రతిగా.. తాజాగా ఆయన్ను యూపీ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ 2018లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఢిల్లీకి వెళ్లే అవకాశమే లేకుండా పోయేది. ఇదంతా చూస్తుంటే.. ఒక ఓటమి ఇద్దరు నేతలకు ఢిల్లీ పదవులు ఇచ్చేలా చేసిన వైనం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తావివ్వటమే కాదు.. వర్తమాన రాజకీయాల్లో మహా సుడిగాళ్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు.