Begin typing your search above and press return to search.

కదులుతున్న కమల దళం

By:  Tupaki Desk   |   2 Oct 2018 2:30 PM GMT
కదులుతున్న కమల దళం
X
ముందస్తు ఎన్నికలకు మహూర్తం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక - ప్రచారం - వ్యూహా రచన - ప్రతి వ్యూహ పథకాలు ఇలా అన్ని చకచకా చేసేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం ఎందుకో వెనుకడుగు వేస్తోంది. ముందస్తు ప్రకటించిన దాదాపు నెల రోజులు కావస్తున్నా కమల నాథులు మాత్రం జోరు పెంచలేదు. అడపాదడపా ప్రకటనలు గుప్పిస్తున్నా.... ఇతర రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా మ్యాజిక్ చేసి అధికారంలోకి వస్తామని స్ధానికి భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అందుకు అనుగుణంగా మాత్రం ఎలాంటి పావులు కదపడం లేదు. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కిమ్మనక....కుయ్యనక మిన్నకుండిపోతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రకటనలు చేసినా అధిష్టానం నుంచి ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని స్ధానిక నాయకత్వం అసలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లుగానే కనిపిస్తోంది. ఎన్నికల వేళ కమలనాథులు తమ నిద్రకళ్లను తెరిచారు.

ఇక తెలంగాణలో జోరుగా కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా మ్యానిఫెస్టో కమిటీని నియమించారు. పనిలో పనిగా ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పేశారు. అంటే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికార పక్షానికి, మహాకూటమిలోని ఇతర పక్షాలకు చెప్పకనే చెబుతున్నారు. మ్యానిఫెస్టో కమిటీని ప్రకటించిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు మరింత జోష్ కోసం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ‎ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బిజెపి సిట్టింగ్ అభ్యర్ధులందరికీ టిక్కట్లు ఖరారు చేయనున్నారు. పార్టీలో ఎన్నాళ్ల నుంచో ఉన్న వారికి ఈ సారి ఎన్నికల్లో టిక్కట్లు ఇచ్చి గట్టి పోటీ ఇవ్వాలని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే తాము అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ల స్థబ్దతను వదిలించుకుని దూసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.