Begin typing your search above and press return to search.

క‌మ‌లంలో సీఎం చిచ్చు

By:  Tupaki Desk   |   4 Nov 2018 3:30 PM GMT
క‌మ‌లంలో సీఎం చిచ్చు
X
ఆయ‌న పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి వివాద‌మే. ఆ మాట‌కొస్తే చేరిన‌ప్పుడే కాదు.... చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి వివాదాలే వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌నుకుంటున్నారా.. ఆయ‌నే శ్రీ పీఠం అధిప‌తి ప‌రిపూర్ణానంద‌. హిందూ స్వామిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న ప‌రిపూర్ణానంద తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌కు మాట మాత్ర‌మైనా చెప్ప‌కుండా క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు. నేరుగా ఢిల్లీ వెళ్లి భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడ్ని క‌లిసి త‌న చేరిక గురించి చెప్పారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా కాని, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ కాని స్వామి చేరిక గురించి తెలంగాణ బీజేపీ నాయ‌కులకు వీస‌మంత కూడా చెప్ప‌లేదు.ప‌రిపూర్ణ చేరిక గురించి తెలియ‌ని బీజెపీ తెలంగాణ నాయ‌కుల‌కు ఆయ‌న చేరిక ఓ షాక్. స‌రే, ఆయ‌న పార్టీలో చేరిపోవ‌డం, అక్క‌డి నుంచి నేరుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి పార్టీ నాయ‌కుల‌ను క‌లుసుకోవ‌డం కూడా జ‌రిగిపోయింది. త‌మ‌కు మాట‌మాత్రంగా కూడా చెప్ప‌కుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పీఠం ఉన్న ఓ మ‌ఠాధిప‌తిని త‌మ నెత్తి మీద కూర్చోపెట్టార‌ని తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు లోలోప‌లే కుమిలిపోయారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కామారెడ్డిలో జ‌రిగిన స‌భ‌లో స్వామి ప‌రిపూర్ణ‌నంద చేసిన కొన్ని వ్యాఖ్య‌లు కూడా పార్టీని ఇబ్బందులు పాలు చేసాయ‌ని పార్టీ నాయకులు లోలోప‌లే కుమిలిపోయారు. తాజాగా ప‌రిపూర్ణానంద చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత కాక‌పుట్టిస్తున్నాయి. ఇంత‌కీ ఆ వ్యాఖ్య‌లు ఏమిట‌నుకుంటున్నారా.... ఏం లేదు... నేను సిఎంనే అంటూ ప‌రిపూర్ణ‌నంద చేసిన వ్యాఖ క‌ల‌క‌లం రేపుతోంది.

ప‌రిపూర్ణ‌నంద శ‌నివారం నాడు పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ నేనే సిఎం.... అంటే నేను కామ‌న్ మ్యాన్ అంటూ భాష్యం కూడా చెప్పారు. ప‌రిపూర్ణానంద పైకి కామ‌న్ మ్యాన్ అంటూ చెప్పినా లోలోప‌ల మాత్రం ఆయ‌న ఉద్దేశ్యం మాత్రం అదే అయి ఉంటుంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో 70 స్ధానాలు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించిన ప‌రిపూర్ణానంద అందుకోసం తాను ప్ర‌చారం చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈమ‌ధ్య కామారెడ్డిలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో ప‌రిపూర్ణానంద చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా పార్టీలో వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోందంటున్నారు. కొత్త‌గా సిఎం నేనే అంటూ ప‌రిపూర్ణానంద చేసిన వ్యాఖ్య‌ల వెనుక పార్టీ అధిష్టానం పెద్ద‌లు ఉన్నార‌ని కూడా అంటున్నారు. తెలంగాణ‌లో ఏ ఒక్క‌రికి పూర్తి మెజార్టీ రాక‌పోతే ప్ర‌భుత్వ ఏర్పాటులో తామే కీల‌కం అవుతామ‌నుకుంటున్న స‌మ‌యంలో ప‌రిపూర్ణానంద చేసిన వ్యాఖ్య‌లకు ప్రాధ‌న్యం పెరిగిందంటున్నారు. ముందు ముందు ఇలాంటి వ్యాఖ్య‌ల కార‌ణంగా పార్టీలో గ్రూపులు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.