Begin typing your search above and press return to search.

ఈ మాట తెలుసుకోవ‌టానికి అంత అంత‌ర్మ‌ధ‌న‌మా?

By:  Tupaki Desk   |   25 Dec 2018 5:22 AM GMT
ఈ మాట తెలుసుకోవ‌టానికి అంత అంత‌ర్మ‌ధ‌న‌మా?
X
కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన‌ట్లుగా ఉంది తెలంగాణ బీజేపీ నేత‌ల తీరు. తెలంగాణ‌లో త‌మ బ‌లం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని.. ఈసారి ఎన్నిక‌ల్లో ఇర‌గ‌దీస్తామంటూ అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు మోడీ బ్యాచ్ చేసిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హైద‌రాబాద్‌ కు క్యూ క‌ట్టేసి మ‌రీ.. బీజేపీ గెలుపు కోసం ప‌డిన శ్ర‌మ అంతా ఇంతా కాదు.

కోట్లాది మందిని నేరుగా ప్ర‌భావితం చేసే తోపులుగా పేరున్న నేత‌లు ప‌లువురు తెలంగాణ‌కు వ‌చ్చి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసినా ఫ‌లితం క‌నిపించ‌ని ప‌రిస్థితి. టీడీపీతో పొత్తుకు చెల్లుచీటీ ఇచ్చేసి.. ఒంట‌రిగా ఎన్నిక‌ల పోరులో దిగిన క‌మ‌ల‌నాథుల‌కు ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు క‌రెంటు షాకుగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కిష‌న్ రెడ్డి లాంటోడు సైతం ఓడిపోవ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది.

అంత పెద్ద వైఎస్ జోరులోనూ గెలిచిన కిష‌న్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ధాటికి చిగురుటాకులా వ‌ణికిపోవ‌ట‌మే కాదు.. ఓట‌మి దెబ్బ‌తో కుదేలైన ప‌రిస్థితి. తెలంగాణ‌లో ప‌దికి మించి స్థానాల్లో తాము గెలుస్తామ‌ని.. తెలంగాణ‌లో సీఎం ఎవ‌ర‌న్న విష‌యాన్ని డిసైడ్ చేయ‌టంలో తాము కీల‌కంగా మార‌తామ‌న్న బిల్డ‌ప్ మాట‌ల‌కు తెలంగాణ ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు కాషాయ‌ద‌ళానికి క‌షాయంగా మారింది. ఒక్క‌టంటే ఒక్క స్థానానికి ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ నేత‌లంతా ఒక చోట కూర్చొని ఓట‌మికి కార‌ణాలు ఏమిట‌న్న అంశంపై భారీ అంత‌ర్మ‌ధ‌నాన్ని చేసుకున్నార‌ట‌.

గంట‌ల కొద్దీ సాగిన ఈ అంత‌ర్మ‌ధ‌నం చివ‌ర‌కు తేల్చిందేమంటే.. కేసీఆర్ లాంటి తోపు త‌మ పార్టీలో లేక‌పోవ‌టం ప‌రాజ‌యానికి కీల‌క కార‌ణంగా తేల్చారు. అంతేనా.. కేసీఆర్ లాంటి ధీటైన నేత‌తో పాటు.. పార్టీలో కింది స్థాయి నాయ‌కులు ఫెయిల్ అయ్యార‌ని.. అదే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీని చావుదెబ్బ తీసిన‌ట్లుగా తేల్చారు.

సీట్ల కేటాయింపులోనూ.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లోనూ ఆల‌స్య‌మైంద‌ని.. అదే పార్టీ ప‌రాజ‌యానికి కార‌ణంగా కొంద‌రు వాదిస్తే.. అభ్య‌ర్థుల ఎంపిక ఏక‌ప‌క్షంగా జ‌రిగింద‌న్న మాట వినిపించింది. ఎన్నిక‌ల్లో ఘోర వైఫ‌ల్యానికి ఎవ‌రినో బాధ్యుల్ని చేయ‌కుండా.. అంద‌రూ క‌లిసి హోల్ సేల్ బాధ్య‌త వ‌హించాల‌ని తేల్చ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ వ‌ర్సెస్ చంద్ర‌బాబుగా చూశారే త‌ప్పించి.. మ‌రోలా చూలేద‌ని.. ఇది కూడా పార్టీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా తేల్చారు. తెలంగాణ‌లో బీజేపీ ఓట‌మికి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టంలోనూ తెలంగాణ బీజేపీ నేత‌లు సక్సెస్ అయ్యారు.

ఏపీకి చెందిన బీజేపీ నేత‌ల‌కు కీల‌క స్థానాల్ని క‌ట్ట‌బెట్టార‌ని.. ఏపీకి చెందిన బీజేపీ నేత‌ల్లో ఒక‌రిని కేంద్ర‌మంత్రిగా.. మ‌రొక‌రికి ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇచ్చార‌ని.. తెలంగాణ నేత‌కు ఇచ్చిన కేంద్ర‌మంత్రి ప‌ద‌విని తీసేశార‌ని.. ఇది కూడా ఓట‌మికి కార‌ణంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి త‌మ చేత‌కానిత‌నాన్ని ఓపెన్ గా ఒప్పేసుకునే క‌న్నా.. పార్టీ అధినాయ‌క‌త్వం తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌ట‌మే ఒట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా తేల్చ‌టం విశేషం. మొత్తానికి తెలంగాణ‌లో బీజేపీ ఓట‌మికి స్థానిక నాయ‌క‌త్వం కంటే కూడా.. ఢిల్లీ అధినాయ‌క‌త్వ‌మే దెబ్బ తీసింద‌న్న విష‌యాన్ని చెప్పిన తీరును చూసిన‌ప్పుడు మాత్రం తెలంగాణ క‌మ‌ల‌నాథుల తెలివికి మురిసిపోవాల్సిందే. ఏమైనా.. తెలంగాణ బీజేపీ నేత‌ల గంట‌ల కొద్దీ అంత‌ర్మ‌ధ‌నం అంతిమంగా తేల్చింది.. కేసీఆర్ మొన‌గాడ‌ని.. అలాంటోడు పార్టీలో లేడ‌ని. ఈ విష‌య‌నికి అన్ని గంట‌ల అంత‌ర్మ‌ధ‌నం అవ‌స‌ర‌మా?