Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు జైకొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   28 Aug 2019 6:08 PM GMT
జ‌గ‌న్‌కు జైకొట్టిన బీజేపీ ఎమ్మెల్యే
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి..త‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందుతున్నారు. త‌న‌ను విమ‌ర్శించే వారి నుంచే..ప్ర‌శంస‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుమల ఆర్టీసీ టిక్కెట్ల పై అన్యమత ప్రచారం అంశం ఏపీ సీఎంను ఇబ్బంది పెట్ట‌గా...ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం తిరుమల తిరుపతి దేవస్థానానికే ప‌రిమితం కాకుండా...రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఉద్యోగం చేస్తోన్న హిందూయేతరులు వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. దీనిపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్ర‌శంస‌లు కురిపించారు.

ఇటీవ‌ల‌ తిరుపతి నుంచి కొండ పైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర - క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ దర్శనమిచ్చాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ప్రకటనలు ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. తిరుమలలో అన్యమత ప్రచారం సాగుతోంద‌ని క‌ల‌క‌లం రేగింది. అయితే, మరోసారి కలకలం రేపింది. గత ప్రభుత్వం చేసిన ఘన కార్యాల ప్రచారం కోసం.. ఆర్టీసీ టిక్కెట్లను ఉపయోగించుకుందని... ఈ విష‌యంలో త‌మ‌కు సంబంధం లేద‌ని..వైసీపీ నేత‌లు - మంత్రులు - టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అయితే, సీఎం జ‌గ‌న్ మ‌రో అడుగు ముందుకు వేసి...రాష్ట్రంలోని దేవాల‌యాల్లో ప‌నిచేస్తున్న‌ అన్య‌మ‌త‌స్తుల‌ను రాష్ట్ర కార్యాల‌యానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ నిర్ణ‌యం పై గోషామహల్ ఎమ్మెల్యే - బీజేపీ నేత రాజాసింగ్ స్పందించారు. టికెట్ల వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చిన‌పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన రాజాసింగ్ తాజాగా ఏపీ సీఎం జగన్‌ స్పందించిన తీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ సీఎం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని కితాబిచ్చారు. త‌న స్పంద‌న‌ను ట్విట్ట‌ర్లో వ్య‌క్తీక‌రిస్తూ..సనాతన ధర్మం - హిందూ ఆలయాల పరిరక్షణ అంశంలో వైఎస్ జగన్ నిర్ణయాన్ని విమ‌ర్శించిన బీజేపీ నేతే...తిరిగి ప్రశంసించడం జ‌గ‌న్ ద‌క్కించుకున్న ప్ర‌త్యేకత అని ప‌లువురు పేర్కొంటున్నారు.