Begin typing your search above and press return to search.

ఇపుడు చేర‌క‌పోతే.. తెలంగాణ‌లో బీజేపీ ఇక అంతేనా..!

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
ఇపుడు చేర‌క‌పోతే.. తెలంగాణ‌లో బీజేపీ ఇక అంతేనా..!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీకి తెలంగాణ వ్య‌వ‌హారాలు చావో రేవోగా తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందా..? ఇపుడు కాక‌పోతే మ‌రెప్పుడూ అవ‌కాశం రాద‌ని భావిస్తోందా..? దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని యోచిస్తోందా..? ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో కీల‌క నేత‌లు చేర‌తారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగానే ఇత‌ర పార్టీల్లోని అసంతృప్తుల‌ను చేర్చుకోవాల‌ని భావిస్తోంది. కొంత మంది బిగ్ షాట్ ల‌నైనా చేర్చుకొని టీఆర్ఎస్ కు తామే ప్ర‌త్యామ్నాయం అని నిరూపించుకోవాల‌ని చూస్తోంది.

అందులో భాగంగానే బీజేపీలోని అన్ని రాష్ట్రాల ప్ర‌జాప్ర‌తినిధులు, ముఖ్య నేత‌లంద‌రూ తెలంగాణ‌పై దండెత్తారు. ప్ర‌తి ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌ల‌ను మోహ‌రించారు. వారంద‌రూ బూత్ లెవ‌ల్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. ప‌నిలో ప‌నిగా ఇత‌ర పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌పై గురి పెడుతున్నారు. 3న హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో మోదీ స‌మ‌క్షంలో బీజేపీలో చేర్పించేలా వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ల‌లో ఉన్న అసంతృప్తుల జాబితా ఇప్ప‌టికే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చేతికి అందినట్లు తెలుస్తోంది. ఆ జాబితా ప్ర‌కారం ఎవ‌రెవ‌రిని ఎపుడు పార్టీలోకి తీసుకోవాలి..? ఇందులో ప్ర‌ధాన నాయ‌కులు ఎవ‌రు..? నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లెవ‌రున్నారు? ఎవ‌రెవ‌రిని మోదీ సమ‌క్షంలో చేర్పించాలి..? ఎవ‌రికి ఎటువంటి హామీలు ఇవ్వాల‌నే విష‌యంలో ఆ పార్టీలో తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఒక్కో జిల్లా నుంచి ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు పార్టీలో చేరేలా చూసుకుంటున్నార‌ట‌. క‌నీసం 20 నుంచి 30 మంది ఎమ్మెల్యే స్థాయి అభ్య‌ర్థుల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇందులో టీఆర్ఎస్ నుంచి ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పిడ‌మ‌ర్తి ర‌వి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, జూప‌ల్లి కృష్ణారావు, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, కోరం క‌న‌క‌య్య, తీగ‌ల కృష్ణారెడ్డి త‌దిత‌ర కీల‌క నేత‌లపై క‌న్నేసింద‌ట‌.

అలాగే.. కాంగ్రెస్ నుంచి కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల రెడ్డి, విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, ఇంకా ఇద్ద‌రు ముగ్గురు ముఖ్య నేత‌లతో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ట‌. వీరంద‌రినీ ఒకేసారి మోదీ స‌మ‌క్షంలో చేర్పిస్తే ఆటోమేటిక్ గానే కాంగ్రెస్ సైడ్ అయిపోతుంద‌ని.. తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ పార్టీగా గుర్తింపు ల‌భిస్తుంద‌ని బీజేపీ భావిస్తోంద‌ట‌. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యదుందుభి మోగించ‌వ‌చ్చ‌ని యోచిస్తోంద‌ట‌.

తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌నే బీజేపీ కోరిక బాగానే ఉన్నా.. పై నేత‌ల్లో కొంద‌రైనా జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో భాగంగా చేరితేనే పార్టీకి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని.. లేదంటే ఇక పార్టీ భ‌విష్య‌త్‌ అంతేన‌ని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!