Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీలో ఇక మార్పు రాదా ..?

By:  Tupaki Desk   |   7 Nov 2019 11:24 AM GMT
తెలంగాణ బీజేపీలో ఇక మార్పు రాదా ..?
X
తెలంగాణ లో ఒక్కో పార్టీది ఒక్కో పరిస్థితి .. అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే .. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ అంతర్గత కలహాలతో పార్టీ పటిష్టత పై కాకుండా తమ పదవులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీనితో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. ఈ రెండు పార్టీల పరిస్థితి కాసేపు పక్కన పెడితే .. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే బిజెపి నేతలు... ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు.

ప్రస్తుతం రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ఎంపిక ప్రాసెస్ నడుస్తున్న తరుణంలో .. రాష్ట్రాల్లో జరుగుతున్నా ఆర్టీసీ సమ్మెను రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడంలో తెలంగాణ కమలం నేతలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్క సారి బీజేపీ తెలంగాణ లో కుదురుకున్నది అని అనిపిస్తుంది. ఆ తరువాత పది రోజులకే బీజేపీ మళ్ళీ మనుగడలో వెనక్కి వెళ్ళి పోతుంది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు అందివచ్చిన అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు కలిసి కట్టుగా పోరాటం చేయడంలో విఫలం అవుతున్నారు. దీనితో వారు ఏ సమస్య పై పోరాడినా కూడా మధ్య లోనే అది నీరు గారి పోతుంది.

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతి హై టెన్షన్ క్రియేట్‌ చేసింది. అంతిమయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతిమయాత్రను బస్‌డిపోకు తీసుకువెళ్లేందుకు కార్మికులు చేసిన ప్రయత్నంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తనపై పోలీసులు చేయి చేసుకున్నారని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వం పై ఒక రేంజ్ లో విరుచుకుపడి సమ్మె ని మరో స్థాయికి చేర్చుతారు అని అందరూ అనుకున్నారు. కానీ , ఈ విషయంపై ఎవరూ కూడా మాట్లాడలేదు. ప్రతి అంశంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి ప్రభుత్వం దుమ్ము దులిపే రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌… ఈవిషయంలో మాత్రం ఓ ప్రెస్‌ నోట్‌ రిలీజ్ చేసి చేతులు దులుపు కున్నారు.

దీనికి ఇంకో కారణం ఉంది అని తెలుస్తుంది. డిసెంబర్‌లో తెలంగాణ బీజేపీ కి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్ష రేసులో సంజయ్‌ కూడా ఉన్నారు. ఈ ఇష్యూను హైలెట్‌ చేస్తే సంజయ్‌ కు మైలేజీ వస్తుంది. అధ్యక్ష రేసులో ఆయన ముందుకు వెళుతారు. దీనితో ఎవరూ కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా సర్దుకున్నారు. మున్సిపల్ ఎన్నికల లో కూడా ఎవరి ఎజెండాను వారు అమలు చేయబోతున్నట్టు గుస గుసలు విన్పిస్తున్నాయి.