Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను పట్టి పీడిస్తున్న దోషం అదేనట!

By:  Tupaki Desk   |   20 Aug 2019 5:20 AM GMT
కేసీఆర్ ను పట్టి పీడిస్తున్న దోషం అదేనట!
X
కొన్నిసార్లు అంతే.. అలా కాలం కలిసి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ ను మాటలతో ఆడుకోవటం సాధ్యమని ఎవరైనా కలలో అయినా ఊహించారా?  కానీ.. ఇప్పుడది డైలీ బేసిస్ గా మారింది. ఒకప్పుడు కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేయాలంటే ఒకటికి పదిమార్లు ఆలోచించుకోవాల్సిన  పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తంగా మారిపోయింది. ప్రజల్లో పట్టు పోవటం.. ఆగ్రహం అంతకంతకూ పెరిగిపోవటంతో కేసీఆర్ ను ఉద్దేశించి ఎంతటి మాట అన్నా.. వారి నుంచి వ్యతిరేకత లేకపోవటంతో మరింతగా చెలరేగిపోతున్న పరిస్థితి.

కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు అంగీకరించలేని పరిస్థితి ఉందన్న మాట విపక్ష నేతలు నోటి నుంచి వినిపిస్తోంది. నిజానికి అదే తమకు విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం.. సచివాలయానికి రాకపోవటం.. అయితే ఫాం హౌస్ లో లేదంటే హైదరాబాద్ లోని అధికార నివాసంలో ఉండటాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించిన పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నాయి.

పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వం తల్లడిల్లుతున్న వేళ.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా తన సెంటిమెంట్లకు అనుగుణంగా భారీ ఎత్తున సచివాలయాన్ని.. అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు.. సూటిగా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నోటినుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగానే కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇరిటేట్ చేసేలా మారాయి.

కేసీఆర్ కున్న దోషాన్ని ఆయన ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు పుత్ర ప్రేమే అసలు దోషమని.. అది పోతే తెలంగాణకు పట్టిన దోషం పోతుందన్నారు. కొడుకును సీఎం చేసేందుకు వాస్తు దోషమంటూ సచివాలయాన్ని కూలగొడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్ లో ఇప్పుడు కొంతమంది ఎక్కువ మాట్లాడుతున్నారని.. వాళ్లంతా గతంలో మరో పార్టీలో ఉన్న వారేనని గుర్తు చేశారు. కొడుకును సీఎం చేయాలన్న ఆలోచనే కేసీఆర్ కు పట్టిన దోషంగా అభివర్ణించిన లక్ష్మణ్ మాటలు ఇప్పుడు బాణాల మాదిరి మారి గులాబీ బాస్ ను ఇబ్బందికి గురి చేస్తున్నాయని చెప్పకతప్పదు.