Begin typing your search above and press return to search.

మొత్తానికి 3 రోజుల‌కు ల‌క్ష్మ‌ణ్ రియాక్ట్ అయ్యారే!

By:  Tupaki Desk   |   5 Sep 2018 10:38 AM GMT
మొత్తానికి 3 రోజుల‌కు ల‌క్ష్మ‌ణ్ రియాక్ట్ అయ్యారే!
X
ఇస్తావా? చ‌స్తావా? అని మోడీని తాను అడిగినందుకే జోన‌ల్ బిల్లు మీద ప్ర‌ధాని సంత‌కం పెట్టారంటూ భారీ బ‌హిరంగ‌ స‌భ‌ను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. దేశ ప్ర‌ధానిని ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉన్నాయ‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది. ఎంత గొప్ప‌లు చెప్పుకోవాల‌నుకుంటే మాత్రం కేసీఆర్ మ‌రీ ఇంత ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉందా? అంటూ ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు.

కొంగ‌ర క‌లాన్ లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌పై బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తార‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది. దీనికి భిన్నంగా తెలంగాణ బీజేపీ నేత‌లు ప‌లువురుపెద్ద‌గా రియాక్ట్ కావ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మైంది. ప్ర‌ధానితో పాటు.. త‌మ పార్టీకి అత్యంత కీల‌క‌మైన నేత మీద ఘాటు వ్యాఖ్య చేసినా క‌మ‌ల‌నాథుల్లో క‌ద‌లిక రాదా? అన్న సందేహం ప‌లువురు వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ వ్యాఖ్య‌లు చేసిన మూడురోజుల త‌ర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ రియాక్ట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌ధాని మోడీపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. సీఎం స్థానంలో ఉండి ప్ర‌ధానిపై ఈ త‌ర‌హా వ్యాఖ్య చేయ‌టం స‌రికాద‌న్నారు.

కొడుకు కేటీఆర్ కు ప‌ట్టాభిషేకం చేయాల‌ని కేసీఆర్ ఆశ‌ప‌డ్డార‌ని.. కానీ కొంగ‌ర స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌న్నారు. టీఆర్ ఎస్ తాజా స‌భ హౌస్ ఫుల్ అయినా క‌లెక్ష‌న్లు నిల్ అన్న‌ట్లుగా మారింద‌ని ఎద్దేవా చేశారు. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి పెట్టిన స‌భ‌తో సాధించిందేమీ లేద‌న్న ఆయ‌న‌.. సీఎం కేసీఆర్ మాట‌ల్లో బ‌లం త‌గ్గింద‌న్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పోతే టీఆర్ ఎస్ కు ఓట‌మి ఖాయ‌మ‌ని అదే ప‌నిగా చెబుతున్న లక్ష్మ‌ణ్ మాట‌ల్ని వింటే కొత్త డౌట్ వ‌స్తోంది. ఇంత‌కీ.. ముంద‌స్తుకు త‌యారుగా లేరా ఏంటి ల‌క్ష్మ‌ణ్ జీ. సొంత పార్టీలో అత్యుత్త‌మ స్థాయిలో ఉన్న‌ నేత‌పై ఘాటు వ్యాఖ్య చేస్తేనే మూడు రోజుల‌కు రియాక్ట్ అయిన లక్ష్మ‌ణ్.. ముంద‌స్తుతో కేసీఆర్ గోల ముందే పోతుంద‌ని సంతోష‌ప‌డ‌క‌.. అదే ప‌నిగా.. ఓడిపోతారు.. ఓడిపోతార‌న‌టంలో అర్థం ఉందా? ఓడిపోయే వారిని ఓడిస్తే స‌రిపోయేదానికి ఉత్త మాట‌ల‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు క‌దా ల‌క్ష్మ‌ణ్ జీ?