Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ కమలం...తెలంగాణ‌లో అన్ని పార్టీలూ టార్గెట్టే

By:  Tupaki Desk   |   17 Jun 2019 8:30 AM GMT
ఆప‌రేష‌న్ కమలం...తెలంగాణ‌లో అన్ని పార్టీలూ టార్గెట్టే
X
ద‌క్షిణాదిలో ఒక్క క‌ర్ణాట‌క త‌ప్పించి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా స‌రైన ప‌ట్టు ల‌భించ‌ని నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ‌లో త‌న‌కు క‌లిసి వ‌చ్చిన అంశాల‌ను ఆధారం చేసుకుని బీజేపీ స‌రికొత్త వ్యూహాల‌ను ర‌చిస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోయిన ఆప‌రేష‌న్ క‌మ‌ల‌... ఏ ఒక్క పార్టీనో టార్గెట్ చేయ‌కుండా... రాష్ట్రంలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న వారు ఏ పార్టీలో ఉన్నా కూడా లాగేసేందుకే య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు నిజంగానే సంచ‌ల‌నంగా మారాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన బ‌ల‌మైన నేత కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధ‌మైపోయారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో చేర‌డం, త‌న‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రికొంద‌రు నేత‌ల‌ను కూడా ఆయ‌న త‌న వెంట బెట్టుకుని వెళ‌తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్ర‌మంలో బీజేపీ తెలంగాణ శాఖ చీఫ్ కె.ల‌క్ష్మ‌ణ్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నాల‌కే సంచ‌ల‌నంగా మారిపోయింది. బీజేపీతో ప‌లువురు నేత‌లు ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న ... ఆ జాబితాలో టీఆర్ఎస్ నేత‌లు కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న విన్నంత‌నే తెలంగాణ‌లో పెను క‌ల‌క‌ల‌మే రేగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ముందస్తు ఎన్నికల్లో బీజేపీ పెద్ద‌గా రాణించ‌లేదు. అయితే తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం ఆ పార్టీ స‌త్తా చాటింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్ల‌లో బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి ఏకంగా నాలుగు సీట్ల‌ను గెలుచుకుంది. అంతేనా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కుమార్తె క‌విత‌ను బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ధ‌ర్మ‌పురి అర‌వింద్ చిత్తుగా ఓడించారు. సింగిల్ గా పోటీ చేసినా నాలుగు సీట్లు ద‌క్కాయంటే... ఇక తెలంగాణ‌లో త‌మ పార్టీకి మంచి భ‌విష్య‌త్తుకు పునాది ప‌డిన‌ట్టేన‌ని భావించిన బీజేపీ నేత‌లు... 2024 ఎన్నిక నాటికి మ‌రింత‌గా బ‌ల‌ప‌డాల‌ని భావించారు.

ఇందుకోసం బీజేపీ అధిష్ఠానం ఓ పక్కా వ్యూహాన్ని ర‌చించ‌గా... దానిని అమ‌లు చేసేందుకు పార్టీలో కీల‌క నేతగా ఎదిగిన రాం మాధ‌వ్ రంగంలోకి దిగిపోయారు. ఈ క్ర‌మంలోనే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అయిపోయింది. అయితే ఇది కోమ‌టిరెడ్డితోనే ఆగ‌ద‌ని దాదాపుగా అన్ని పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నేత‌లంద‌రినీ లాగేయాల‌ని బీజేపీ యోచిస్తోంది. ఈ క్ర‌మంలనే ఏకంగా టీఆర్ఎస్ కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌తో కూడా బీజేపీ నేత‌లు సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లుగా లక్ష్మ‌ణ్ ప్ర‌క‌ట‌న చెబుతోంది. రాం మాధ‌వ్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయితే మాత్రం తెలంగాణ‌లో అధికారంలో ఉన్నప్ప‌టికీ టీఆర్ఎస్ కు షాక్ త‌ప్ప‌ద‌న్న మాట‌,. కేంద్రంలో రీసౌండింగ్ మెజారిటీతో వ‌రుస‌గా రెండో సారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన న‌రేంద్ర మోదీ... 2024 ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని ఓ బ‌ల‌మైన శ‌క్తిగా తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగానే తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ క‌మ‌ల స్టార్ట్ అయిపోయింద‌ని, ఈ ఆప‌రేష‌న్ తో టీఆర్ఎస్ కు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?