Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ఎక్కడో టచ్ అయ్యే మాటలు పడ్డాయే..

By:  Tupaki Desk   |   20 Aug 2019 6:30 AM GMT
కేటీఆర్ కు ఎక్కడో టచ్ అయ్యే మాటలు పడ్డాయే..
X
కాలం కలిసి వస్తే ఇలానే ఉంటుంది. కలిసి రానప్పుడు తాడు కాస్తా పాము అవుతుందంటారు.. కలిసి వస్తే పాము కాస్తా తాడుగా మారటమే కాదు.. తాట తీసేలా మారుతుంది కూడా. తాజాగా కేటీఆర్ మీద బీజేపీ నాయకత్వం విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. తెలంగాణ గడ్డ మీద కేటీఆర్ ను అన్నేసి మాటలు అనగలిగే ధైర్యం లక్ష్మణ్ లాంటి బక్కజీవికి వచ్చేయటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

తన వాదాన్ని బలంగా వినిపిస్తారన్న పేరు తప్పించి.. విరుచుకుపడే మాటతో కడిగిపారేయటం లాంటివి లక్ష్మణ్ లో ఎంతకూ కనిపించని గుణంగా చెబుతారు. సాధారణ జీవితం.. పెద్ద పెద్ద వ్యాపారాలు.. కాంట్రాక్టులు లాంటివి లేకపోవటం.. రాజకీయం తప్పించి మరే ఇతర వ్యాపకం లేకపోవటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. పార్టీ ఏదైనా సరే.. తమను చికాకు పెట్టే వారి ఆర్థిక మూలాల్ని ఇబ్బందులకు గురి చేయటం అధికారపక్షంలో ఉన్న వారికి ఇప్పుడో అలవాటుగా మారింది. ఈ లెక్కన చూసినప్పుడు లక్ష్మణ్ లాంటి నేతను ఏమీ చేయలేని పరిస్థితి.

బీజేపీని ఉద్దేశించి టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారితే.. దానికి కౌంటర్ గా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటలు చూస్తే..అతడు సినిమాలో మహేశ్ బాబు ఫైట్ చేసిన తర్వాత తనికెళ్ల భరణి పాత్ర చెప్పే డైలాగు మాదిరి.. సెటిల్డ్ గా మాటలతో కేటీఆర్ ను కడిగేసిన వైనం చూడముచ్చటగా ఉండటమే కాదు.. సంచలనంగా మారింది.

ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఇంత తీవ్రస్థాయిలో కేటీఆర్ ను అన్న నేతే లేరని చెప్పాలి. బీజేపీ నేతలకు దమ్ముంటే తాము చేసిన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరిన కేటీఆర్ కు పంచ్ లు ఇస్తూ.. మీరు మెక్కిందంతా కక్కిస్తాం.. కేంద్రంలో ఉన్నది మోడీ.. అమిత్ షా ప్రభుత్వమన్న విషయాన్ని మర్చిపోవద్దు. రుజువులు కావాలన్న కోరిక మీకు అంతగా ఉంటే.. దమ్ముంటే విద్యుత్ ప్రాజెక్టులు.. సాగునీటి ప్రాజెక్టు ఖర్చుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారా? అని సవాలు విసిరారు. అప్పుడు తాము అన్ని ఆధారాల్ని ప్రవేశపెడుతామన్నారు. సీఎం కేసీఆర్ కొడుకుగా పుట్టకపోతే మీ అడ్రస్ ఎక్కడ? మీ చరిత్ర ఎక్కడ? మీ మాదిరి అమెరికా నుంచి పారాచ్యూట్ లో ఊడిపడిన వ్యక్తికాదు నడ్డా.. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వ్యక్తి కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఎవరో తెలీదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి .. అధికార మదానికి తార్కాణంగా మండిపడ్డారు. రాజకీయాలపై ఆయనకున్న అవగాహన ఎంత ఉందో తాజా వ్యాఖ్యల్ని చూస్తే తెలుస్తుందన్నారు. తండ్రి పార్టీ అధ్యక్షుడు.. కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఇదీ మీ చరిత్ర. బీజేపీలో 1980 నుంచి ఇప్పటివరకూ 18 మంది అధ్యక్షులుగా కొనసాగారు. ఇది మీ పార్టీలో సాధ్యమా? అని ప్రశ్నించారు. ఇలా ఘాటు వ్యాఖ్యలతో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపించేలా లక్ష్మణ్ చేశారని చెప్పక తప్పదు.