Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌వాల్...ఇంకో పార్టీ కూడా రియాక్టైంది

By:  Tupaki Desk   |   25 Jun 2018 2:15 PM GMT
కేసీఆర్ స‌వాల్...ఇంకో పార్టీ కూడా రియాక్టైంది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌దిలించిన ముందస్తు ఎన్నిక‌ల తేనెతుట్ట రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాలు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నాయ‌ని పేర్కొంటూ ముంద‌స్తుకు తాము సిద్ధ‌మ‌న్నారు. అయితే ఇలా కేసీఆర్ స‌వాల్ విస‌ర‌డం ఆల‌స్యం..ఆయా పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ముంద‌స్తుకు తాము రెడీ అని ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో తాజాగా బీజేపీ కూడా చేరింది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని - ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా.. బీజేపీ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ స్ప‌ష్టం చేశారు.

బ‌స్సుయాత్ర చేప‌ట్టిన డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌కవ‌ర్గంలో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ సార్వ‌త్రిక ఎన్నిక‌లు - అసెంబ్లీ ఎన్నిక‌లను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ త‌ల‌పెట్టిన మార్పు కోసం జ‌న చైత‌న్య యాత్రకు విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని - ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌లు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని ఆయ‌న అన్నారు. యాత్ర‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌, స్పంద‌న‌ను చూసి ఓర్వలేక ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఎగ‌తాళిగా మాట్లాడుతున్నార‌ని, కేసీఆర్ తీవ్ర నిరాశ‌ - నిస్పృహల్లో ఉన్న‌ట్లు అర్ధ‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌జల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మైండ్ గేమ్ మొద‌లు పెట్టిన కేసీఆర్‌.. 100 సీట్లు వ‌స్తాయ‌ని చెపుతున్నార‌ని, అదే నిజ‌మైతే మ‌రి ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో త‌మ‌కు ఒరిగిందేమీ లేద‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

టీఆర్ ఎస్ స‌ర్కార్‌ కు ఎలా క‌ర్ర కాల్చి వాత పెట్టాలో తెలంగాణ ప్ర‌జానీకానికి బాగా తెలుస‌ని - మ‌జ్లిస్ పార్టీతో అంట‌కాగుతున్న టీఆర్ ఎస్ కు ప్ర‌జ‌లు త‌గిన స‌మయంలో త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ అన్నారు. హిందూ స‌మాజాన్ని కించ‌ప‌రిచే విధంగా మాట్లాడిన మ‌జ్లిస్ పార్టీ నాయ‌కులతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల్లో బుద్ధి చెబుతార‌న్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లొచ్చినా బీజేపీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంద‌ని, ఇబ్ర‌హీంప‌ట్నం స‌భ‌లో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ పున‌రుద్ఘాటించారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న టీఆర్ ఎస్‌.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి త‌క్ష‌ణం ఎన్నిక‌ల‌కు రావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ డిమాండ్ చేశారు. మార్పుకోసం బీజేపీ జ‌న‌చైత‌న్య యాత్ర‌కు వ‌స్తున్న విశేష స్పంద‌నతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పీఠం క‌దులుతున్న‌ద‌ని, సీఎం కేసీఆర్‌కు ద‌మ్ముంటే తన ప్ర‌శ్న‌ల‌కు మూడు రోజుల్లో స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స‌ర్వేల పేరిట కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని, కేసీఆర్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని, 100 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌ ను విశ్వ‌న‌గ‌రంగా మారుస్తామ‌న్న కేసీఆర్ మాట ఏమైంద‌ని - నాలుగేళ్లు గడిచినా విశ్వ‌న‌గ‌రం ఊసే ఎత్త‌డం లేద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో రోడ్ల‌పై ఒక్క గుంత క‌నిపించిన న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని చెప్పిన మంత్రి కేటీఆర్‌.. ఇవాళ రోడ్ల‌పై గుంత‌లపై ఏం స‌మాధానం చెబుతార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ ప్ర‌శ్నించారు.

టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్.. ఈ నాలుగేళ్లలో ఎంద‌రికి ఉద్యోగాలిచ్చార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర నిరాశ‌ - నిస్రృహ‌ల్లో కూరుకుపోయార‌ని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. ఎక్క‌డో ఎర్ర‌వెల్లిలో ఇళ్లు క‌ట్టించిన రాష్ట్ర‌మంతా డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్లు క‌ట్టించామ‌ని చెప్పుకోవ‌డ‌వం సిగ్గుచేట‌ని - జ‌ర్న‌లిస్టుల‌ను సైతం ఇళ్ల‌పేరిట మోసం చేశార‌ని కేసీఆర్‌ పై డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ ధ్వ‌జ‌మెత్తారు. కోటి ఎక‌రాల‌ను సాగునీరు - ఇంటింటికి తాగునీరు - కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి హామీల‌ను తుంగ‌లో తొక్కార‌ని - నాలుగేళ్ల‌యినా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాల‌ను ఎందుకు నెర‌వేర్చ‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను విస్మ‌రించి కేవ‌లం కాంట్రాక్ట‌ర్లు - నాయకుల జేబులు నింపే మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీరథ వంట ప‌థ‌కాల‌పైనే దృష్టి పెట్టార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మొద‌టి ముఖ్యమంత్రిగా ద‌ళితుడిని చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి రాగానే ముఖ్య‌మంత్రి పీఠమెక్కి ద‌ళితుల‌ను దగా చేశార‌న్నారు.