Begin typing your search above and press return to search.

అన్ని చోట్లా పోటీ..క‌ఠిన ప‌రీక్ష‌ను పెట్టుకుంటున్న బీజేపీ!

By:  Tupaki Desk   |   10 Jan 2020 2:30 PM GMT
అన్ని చోట్లా పోటీ..క‌ఠిన ప‌రీక్ష‌ను పెట్టుకుంటున్న బీజేపీ!
X
తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామంటూ త‌మ పార్టీ గురించి ప్ర‌క‌టించారు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి. తెలంగాణ‌లో ప్ర‌జ‌లు త‌మ‌కే ఓటు వేయాల‌ని కూడా ఆయ‌న అభ్య‌ర్థించారు. తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌రిస్థితి ఏమిటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌మ‌లం పార్టీ సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసింది. అనూహ్యంగా ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇక తెలంగాణ‌లో త‌మ‌దే హ‌వా అని బీజేపీ చెబుతూ ఉంది.

అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఏ మాత్రం స‌త్తా చూపించ‌లేక‌పోయింది. కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క ఎమ్మెల్యే సీటుకు ప‌రిమితం అయ్యింది. ఆఖ‌రికి కిష‌న్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయారు. అయితే లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయిన కిష‌న్ రెడ్డి - ఎంపీగా నెగ్గి కేంద్ర‌మంత్రి అయ్యారు.

ఆ త‌ర్వాత బీజేపీ వాళ్లు వివిధ సంద‌ర్భాల్లో మాట్లాడుతూ.. తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్య‌నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా తెలంగాణ వాళ్ల‌తో మాట్లాడుతూ.. అధికార‌మే ల‌క్ష్య‌మ‌ని ఉద్భోదించార‌ట‌. ఇలా త‌ర‌చూ తెలంగాణ‌లో అధికారం అంటూ క‌మ‌లం పార్టీ వాళ్లు మాట్లాడుతూ ఉంటారు.

ఇలాంటి నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి క‌ఠిన ప‌రీక్షే. అధికారం నెక్ట్స్ త‌మ‌దేనంటూ, తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఓడించి తామే అధికారంలోకి వ‌స్తామంటూ ప్ర‌క‌టించుకున్న బీజేపీ.. అందుకు త‌న వ‌ద్ద ఎంత స‌త్తా ఉందో స్థానిక ఎన్నిక‌ల్లో చూపాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ ను స్థానిక ఎన్నిక‌ల్లో చిత్తు చేస్తే అప్పుడు బీజేపీ మీద న‌మ్మ‌కం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా..స్థానిక ఎన్నిక‌ల‌తో సంబంధం లేదు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే స‌త్తా చూపిస్తాం.. అంటే మాత్రం అదంతా ఉత్త‌మాట‌లు అవుతాయి. అన్ని చోట్లా పోటీ చేస్తామంటూ బీజేపీ ప్ర‌క‌టించింది కాబ‌ట్టి..ఇప్పుడు అస‌లు క‌థ బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలున్నాయి.