Begin typing your search above and press return to search.

10 రోజుల పాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..18 న బడ్జెట్ : బీఏసీ నిర్ణయం !

By:  Tupaki Desk   |   15 March 2021 3:41 PM GMT
10 రోజుల పాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..18 న బడ్జెట్ : బీఏసీ నిర్ణయం !
X
తెలంగాణ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈరోజు శాసన సభలో గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 26 వతేదీ వరకూ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రెండో రోజు 16న మరణించిన సభ్యులకు సంతాపం, 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. అనంతరం ఈ నెల 18న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత రోజు సభకు సెలవు. అనంతరం 20వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది.

మరుసటి రోజు 21 ఆదివారం సెలవు. సోమవారం 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ సమావేశాలు కొనసాగుతాయి. చివరిరోజున అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెడతారు. సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం కేటాయిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రేపు దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్యకు ఉభయసభలలో సంతాపం తెలుపనున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కోరింది.

ఒక వరుసలో ఒక్కరే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లను, కౌన్సిల్ లో ఆరు అదనపు సీట్లను ఏర్పాటు చేశారు. కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సభ్యలు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, గొంగడి సునీత, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ప్రతినిధి పాషా ఖాద్రి హాజరయ్యారు.