Begin typing your search above and press return to search.

ఆ స్వర్గాన్ని తీసుకురావటమే కేసీఆర్ లక్ష్యమట

By:  Tupaki Desk   |   9 Aug 2016 6:07 AM GMT
ఆ స్వర్గాన్ని తీసుకురావటమే కేసీఆర్ లక్ష్యమట
X
తరచూ రివ్యూలు నిర్వహించటం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మామూలే. తాజాగా ఆయన పచ్చదనం మీద ఎంతగా ఫోకస్ పెట్టారో తెలిసిందే. హరితహారం పేరిట భారీగా నిర్వహిస్తున్న కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి.. మొక్కల పెంపకానికి సంబంధించిన పనులు ఎలా జరిగాయన్న విషయాన్ని తానే స్వయంగా తెలుసుకుంటానని.. ఇందులో భాగంగా ఆకస్మిక తనిఖీల్ని నిర్వహించనున్నట్లుగా ఆ మధ్యన కేసీఆర్ వెల్లడించారు.

ఇందుకోసం కేసీఆర్ ముహుర్తం కూడా నిర్ణయించారు. ఫలానా అన్న చోటు చెప్పకుండా.. తాను ఆకస్మిక తనిఖీలు చేపడతానని.. మొక్కలు నాటని వారిపై చర్యలు తప్పవని.. మొక్కలు నాటటంతోనే పని పూర్తి కాదని.. వాటిని శ్రద్ధతో పెంచాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. తాను పిలుపునిచ్చిన హరితహారం కార్యక్రమ పనులు ఎలా జరిగాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి ఆ పని ఇప్పటివరకూ చేసింది లేదు. తాజాగా.. ఆయన అటవీశాఖ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంపై తనకున్న మక్కువను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.

తాను పచ్చదనానికి గాఢమైన ప్రేమికుడినని.. తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం గ్రీన్ కవర్ పెంచటానికి ఎలాంటి చర్యలు తీసుకోవటానికైనా తాను సిద్ధమన్న విషయాన్ని స్పష్టం చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు భూతల స్వర్గంలా ఉండేదని.. ఇప్పుడు మళ్లీ ఆ స్వర్గాన్ని తీసుకురావటమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో 45 శాతం జనాభా నగరాలు.. పట్టణాలో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. పట్టణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి మొక్కలు నాటితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ అటవీ భూములు ఉన్నా.. అడవులు మాత్రం లేవన్న ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచటానికి నిధుల కొరతే లేదని తేల్చేశారు. నిధులు ఎన్ని ఖర్చుపెట్టినా.. క్షేత్రస్థాయిలో హరితహారం కార్యక్రమం ఎంత మొక్కుబడిగా సాగుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్న కేసీఆర్ గుర్తించాలి. హరితహారం కార్యక్రమం మొదలయ్యాక తాను ఆకస్మిక పర్యటనలు చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకూ ఆ పని చేయకుండా రివ్యూలతో కాలం గడిపితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నవిషయాన్ని కేసీఆర్ గుర్తిస్తే మంచిదంటున్నారు. ఆకస్మిక తనిఖీలతో కర్ర పట్టుకుంటే కానీ.. పచ్చదనం మీద కేసీఆర్ చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి రాదనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.